లాభాలు
నష్టాలు
సమాఖ్య స్ఫూర్తికి ప్రమాదం..!
కేంద్ర, రాష్ట్ర చట్టసభలకు, ఇంకా అవసరమైతే స్థానిక సంస్థలకు జమిలి ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచన పైకి మంచిగానే కనబడుతున్నప్పటికీ, లోతుగా విశ్లేషిస్తే, ప్రజాస్వామ్య విలువలు, సమాఖ్యస్ఫూర్తికి ప్రమాదం వాటిల్లే అవకాశాలు ఉన్నట్టు పలువురు రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘ఐదేండ్ల కాలానికి ఎన్నికైన ఏదైనా ప్రభుత్వం మధ్యలో కూలిపోతే ఏమి చేయడం? అక్కడ మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తే కొత్త ప్రభుత్వం ఐదేండ్ల కాలానికి అధికారం చేపడుతుంది. అప్పుడు ఉమ్మడి ఎన్నికల వ్యవస్థ (జమిలి) లక్ష్యం దెబ్బతింటుంది. ఇలా జరుగకుండా ఉండాలంటే, కొత్త ప్రభుత్వం కాలపరిమితిని కుదించాల్సి ఉంటుంది. ఇది ప్రజాతీర్పుకు, సమాఖ్యస్ఫూర్తికి, ప్రజాస్వామ్య విలువలకు గొడ్డలి పెట్టులాంటిదే’ అని వాళ్లు వాదిస్తున్నారు.
‘జమిలి’పై బీజేపీ పట్టు ఎందుకు?
జమిలి ఎన్నికలు నిర్వహిస్తే.. 77 శాతం మంది ప్రజలు ఒకే పార్టీ లేదా కూటమిని ఎన్నుకునే అవకాశాలున్నాయని పబ్లిక్ పాలసీ మేధోసంస్థ ఐడీఎఫ్సీ వివిధ సందర్భాల్లో చేసిన సర్వేల్లో తేలింది. అదే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఆరు నెలల ఎడంతో నిర్వహిస్తే ఒకే పార్టీని ఎన్నుకొనే అవకాశాలు 61శాతానికి తగ్గిపోతాయని ఆ సర్వే పేర్కొంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఏడాది ఎడంతో జరిగితే ప్రభావం మరింతగా తగ్గొచ్చని వెల్లడించింది. 1952 నుంచి 2019 వరకు జరిగిన సాధారణ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళిని విశ్లేషించి ఈ రిపోర్టును తయారుచేసింది. జమిలి ఎన్నికల్లో జాతీయ అంశాల ఆధారంగా.. అసెంబ్లీకి ఓటేసే అవకాశమున్నదని, దీంతో ప్రాంతీయ పార్టీలు ఎన్నికల్లో దెబ్బతినే ప్రమాదమున్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అనుకొన్న ఫలితాలు రాలేదు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్షా సహా ఆ పార్టీ నేతలు జమిలి ఎన్నికల నిర్వహణకు పట్టుబడుతున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు.