West Bengal SIR : పశ్చిమ బెంగాల్లో ‘సర్’ అంశం రాజకీయ వివాదంగా మారిన సంగతి తెలిసిందే. సర్ పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం అర్హులైన వారి ఓట్లను తొలగిస్తోందని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం, శనివారాల్లో సర్ తర్వాత రెండు విడతలుగా ఓటర్ల తుది సవరణ జాబితా విడుదలైంది. ఈ లిస్టులో మాజీ ఎంపీ పేరు గల్లంతవ్వడం విశేషం. లోక్‌సభ మాజీ ఎంపీ తరుణ్ మోండల్ పేరు ఓటరు జాబితానుంచి గల్లంతైంది. అయితే, ఆయన భార్య పేరు మాత్రం లిస్టులో ఉంది.
దక్షిణ హౌరా అసెంబ్లీ నియోజకవర్గంలోని 279 నెంబర్ బూత్‌లో ఆయన తన ఓటు హక్కును గతంలో కలిగి ఉండేవారు. కానీ, ఇప్పుడు సర్ రివిజన్ తర్వాత ఆయన పేరు జాబితాలోంచి తొలగించింది ఈసీ. తరుణ్ మోండల్ 2009లో పశ్చిమ బెంగాల్లో ఎస్‌యూసీఐ నుంచి గెలుపొందారు. అప్పుడు ఆయనకు అటు కాంగ్రెస్, ఇటు టీఎంసీ మద్దతు ఇచ్చింది. దీంతో ఆయన గెలుపొందారు. కానీ, ఇప్పుడు ఆయన పేరు ఓటరు జాబితాలోనే లేదు. ప్రస్తుతానికి ఆయన పేరును అండర్ కన్సిడరేషన్ కేటగిరిలో ఉంచారు. ‘సర్’ అనంతరం సప్లిమెంటరీ ఓటర్ లిస్టును ఎలక్షన్ కమిషన్ శనివారం సాయంత్రం విడుదల చేసింది. ఇది మూడో జాబితా. అయితే, ఈ జాబితాలో ఎంతమంది పేర్లు తొలగించారు, ఎంతమంది పేర్లు చేర్చారు, మొత్తం ఓటర్ల వివరాలు వంటివి మాత్రం వెల్లడించలేదు.
ఈ లిస్టును అడిషనల్ లిస్టుగా ఈసీ పేర్కొంది. పశ్చిమ బెంగాల్లో గత నెలలో సర్ పూర్తైంది. మొత్తంగా ఇప్పటివరకు పశ్చిమ బెంగాల్లో 58 లక్షల ఓటర్లను జాబితా నుంచి తొలగించింది. దీంతో గతంలో 7.66 కోట్లుగా ఉండే ఓటర్ల సంఖ్య తర్వాత 7.08 కోట్లకు చేరింది. తుది సవరణల అనంతరం ఇప్పుడు 7.04 కోట్ల ఓటర్లు కలిగి ఉన్నట్లు ఈసీ తెలిపింది. 60 లక్షల ఓటర్లు జ్యుడీషియల్ స్క్రూటినీ కింద ఉన్నాయి. ఏప్రిల్‌లో పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.