PM Modi : తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ అధికారంలో ఉన్నంతకాలం పశ్చిమబెంగాల్ (West Bengal) లో మహిళలకు రక్షణ ఉండదని ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. స్త్రీలను హింసించే గూండాలకు ఆ పార్టీ అండగా నిలుస్తోందని విమర్శించారు. అందుకే రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ప్రధాని వ్యాఖ్యానించారు. ఈసారి ఎన్నికల్లో బీజేపీ (BJP) ని గెలిపిస్తే మహా జంగిల్ రాజ్ నుంచి రక్షణ కల్పిస్తామని చెప్పారు. మహిళల రక్షణ గురించి తాము ఆలోచిస్తాం కాబట్టే ఆర్జీకర్ మృతురాలి తల్లికి తమ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల టికెట్ ఇచ్చామని చెప్పారు.
బెంగాల్లో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలపై దారుణాలకు పాల్పడిన నిందితులను న్యాయస్థానం ముందు నిలబెడతామని అన్నారు. బంగావ్‌లో జరిగిన ఒక బహిరంగ సభలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో తరచుగా బాలికలు అదృశ్యమవుతున్నకేసులు నమోదు అవుతున్నాయని మోదీ గుర్తుచేశారు. అయినప్పటికీ టీఎంసీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకుండా నిద్రపోతోందని మండిపడ్డారు. మహిళలతోపాటు రైతులు, కార్మికుల సంక్షేమం కోసం కేంద్రంలో బీజేపీ కృషి చేస్తోందని అన్నారు.
గడిచిన 11 ఏళ్లలో జనపనార కనీస మద్దతు ధరలను రెట్టింపు చేసిందని అన్నారు. గోధుమలు, బియ్యం కోసం 100 శాతం జనపనార ప్యాకేజింగ్‌ను తప్పనిసరి చేశామని చెప్పారు. హుగ్లీ నది పరిసరాల్లో ఒకప్పుడు మిల్లులు, ఫ్యాక్టరీలు అధికంగా ఉండేవన్నారు. ప్రస్తుత ప్రభుత్వం వాటన్నిటినీ మూసివేసిందని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే వాటిని తిరిగి తెరిపిస్తామని చెప్పారు. చొరబాటుదారుల నుంచి బెంగాల్‌కు విముక్తి కల్పిస్తామని హామీ ఇచ్చారు. బెంగాల్ అభివృద్ధి చెందాలంటే తాము అధికారం చేపట్టాల్సిందేనని అన్నారు.