Bengal Governor : కోల్‌కతా వైద్యురాలిపై హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా పెనుదుమారం రేపుతోంది. ఈ ఘటన సభ్యసమాజానికి సిగ్గుచేటని పలువురు తీవ్రంగా ఖండిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ గురువారం ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రిని సందర్శించి ఆందోళన చేపట్టిన డాక్టర్లు, విద్యార్ధులతో ముచ్చటించారు. మీకు న్యాయం జరుగుతుంది..మీ ఆవేదనను విని అర్ధం చేసుకునేందుకు తాను స్వయంగా ఇక్కడకు వచ్చానని ఈ సందర్భంగా గవర్నర్ ఆనంద బోస్ భరోసా ఇచ్చారు.
ఈ పోరాటంలో మనం విజయం సాధిస్తామని అన్నారు. తామంతా మీకు అండగా ఉంటామని మీ సమస్యలను పరిష్కరించేందుకు తాను మీ వెన్నంటి నిలుస్తానని హామీ ఇచ్చారు. ఇక వైద్యురాలిపై హత్యాచార ఘటనను అంతకుముందు బెంగాల్ గవర్నర్ ఆనంద బోస్ తీవ్రంగా ఖండించారు. ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో జరిగిన విషాదం మన మనస్సాక్షిని కదిలించిందని అన్నారు.
ఈ ఘటన బెంగాల్‌కు, దేశానికి, మానవత్వానికి సిగ్గుచేటని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం ఇదే తొలిసారి కాదని, గతంలో వీధుల్లో మహిళలపై అఘాయిత్యాలను ఎన్నో చూశామని చెప్పారు. నడివీధిలో మహిళలను వివస్త్రలను చేయడం, బహిరంగంగా కొట్టడం, కొరడాలతో కొట్టడం వంటివి రాష్ట్రంలో వెలుగుచూశాయని ఆయన గుర్తుచేశారు. బెంగాల్లో ఈ తరహా ఘటనలు పునరావృతం అవుతున్నాయని అన్నారు. ఈ వేధింపులకు వ్యతిరేకంగా సమిష్టి కార్యాచరణతో ముందుకెళితే వీటిని అడ్డుకోగలుగుతామని చెప్పారు.
Read More :
Independence Day | స్వాతంత్య్ర దినోత్సవం.. పూరీ తీరంలో ఆకట్టుకుంటున్న సైకత శిల్పం