కోల్‌కతా, సెప్టెంబర్ 19: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా హత్యాచార ఘటనపై గత 42 రోజులుగా నిరసనను చేపడుతున్న అక్కడి జూనియర్ డాక్టర్లు ఒక మెట్టు దిగారు. తమ డిమాండ్లను నెరవేర్చుతామని మమతా బెనర్జీ సర్కార్ అంగీకరించిన నేపథ్యంలో, పాక్షికంగా సమ్మెను విరమిస్తున్నట్టు గురువారం రాత్రి ప్రకటించారు. శనివారం నుంచి అత్యవసర వైద్య సేవలకు హాజరవుతున్నట్టు తెలిపారు.
ఔట్ పేషెంట్ విభాగం (ఓపీడీ)లో విధులకు మాత్రం దూరంగా ఉంటామని, హత్యాచార ఘటనపై తమ నిరసన కొనసాగుతుందని వైద్యులు ప్రకటించారు. కోల్‌కతా స్వాస్థ్య భవన్ ముందు చేపట్టిన ధర్నాను ఉపసంహరిస్తున్నట్టు ‘వెస్ట్ బెంగాల్ జూనియర్ డాక్టర్స్’ ఫ్రంట్ సభ్యులు ప్రకటించారు.
సీఎం మమతా బెనర్జీతో ముఖాముఖి చర్చల అనంతరం, కోల్‌కతా జూనియర్ డాక్టర్లు కీలక నిర్ణయం ప్రకటించారు. తమకు న్యాయం జరిగేవరకు రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు ఓపీడీ విధులకు దూరంగా ఉంటారని, రాష్ట్రవ్యాప్తంగా తమ ధర్నా కొనసాగుతుందని స్పష్టం చేశారు. హామీలు నెరవేర్చేందుకు వారం రోజులు ఎదురుచూస్తామని, అవసరం అనుకుంటే ఉద్యమాన్ని మళ్లీ ఉధృతంగా చేపడతామని అన్నారు.
హత్యాచార ఘటనలో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం కోల్‌కతాలోని సీబీఐ కార్యాలయం వైపు భారీ ర్యాలీ చేపడుతున్నట్టు ప్రకటించారు. హత్యాచార ఘటనలో న్యాయం చేయడానికి ఇంకెంత కాలం పడుతుందని సీబీఐని ప్రశ్నించదలుచుకున్నామని అన్నారు. దీనికి సీబీఐ వర్గాలు తప్పకుండా సమాధానం చెప్పి తీరాలని డాక్టర్లు డిమాండ్ చేశారు.
కోల్‌కతా ఆర్జీ కర్ హాస్పిటల్ పీజీ ట్రైనీ వైద్యురాలు హత్యాచార ఘటనకు సంబంధించిన కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ, హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ మెడికల్ రిజిస్ట్రేషన్‌ను పశ్చిమ బెంగాల్ మెడికల్ కౌన్సిల్ గురువారం రద్దు చేసింది. ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్న ఘోష్ పేరును రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ జాబితా నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించింది.
బెంగాల్ మెడికల్ యాక్టు 1914 ప్రకారం అతని లైసెన్స్‌ను రద్దు చేసినట్టు తెలిపింది. ఈ చర్యతో ఆర్థోపెడిక్ సర్జన్ అయిన ఘోష్ ఇక నుంచి ప్రాక్టీస్ చేయలేరు. కాగా, ఘోష్ లైసెన్స్ రద్దు తమ ఉద్యమ విజయంగా జూనియర్ డాక్టర్స్ ఆందోళనకు నేతృత్వం వహిస్తున్న అకికెట్ మహతో వ్యాఖ్యానించారు. ‘బెంగాల్ మెడికల్ కౌన్సిల్ ఎట్టకేలకు స్పందించి ఈ చర్యకు ఉపక్రమించినందుకు సంతోషంగా ఉంది. దివంగత సోదరి సాధించిన విజయమిది’ అని ఆయన అన్నారు.