కోల్కతా : బీఎస్ఎఫ్ అధికార పరిధిని విస్తరిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో టీఎంసీ ప్రభుత్వం తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. పశ్చిమ బెంగాల్లోని బంగ్లాదేశ్తో అంతర్జాతీయ సరిహద్దులో జరుగుతున్న నేర కార్యకలాపాలను అరికట్టేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కఠిన చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా అక్టోబర్లో అసోం, పంజాబ్, పశ్చిమ బెంగాల్లో అంతర్జాతీయ సరిహద్దు నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న అధికార పరిధిని 50 కిలోమీటర్లకు పెంచింది.
దీంతో భద్రతా బలగాలకు అరెస్టులు, సోదాలు, స్వాధీనం చేసుకునేందుకు అధికారం ఇస్తూ బీఎస్ఎఫ్ చట్టాన్ని సవరించింది. అయితే ఈ నిర్ణయాన్ని మమత వ్యతిరేకించారు. దీనిపై గతంలో మమత కేంద్రానికి సైతం లేఖ రాశారు. తీర్మానం సందర్భంగా చర్చలో అధికార పరిధి పెంపును వెనక్కి తీసుకోవాలని కేంద్రాన్ని మంత్రి పార్థ ఛటర్జీ డిమాండ్ చేశారు. తీర్మానాన్ని ప్రతిపక్ష నేత సువేందు అధికార వ్యతిరేకించారు. రాష్ట్ర పోలీసులు, బీఎస్ఎఫ్ మధ్య వివాదాల ప్రశ్నే లేదన్నారు. ఇప్పటికే పంజాబ్ ప్రభుత్వం సైతం కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసింది.