UPSC Aspirant | ఢిల్లీ (Delhi)లోని ఓల్డ్ రాజేందర్ నగర్ (Old Rajinder Nagar)లో గల ఓ కోచింగ్ సెంటర్లోకి (Coaching Centres) వరద నీరు ప్రవేశించి ముగ్గురు విద్యార్థులు మరణించిన విషయం తెలిసిందే. రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్లో (Coaching Centre) శనివారం రాత్రి జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటన మరవకముందే అదే ప్రాంతంలో సివిల్ సర్వీసెస్ అభ్యర్థిని (UPSC Aspirant) తాజాగా ఆత్మహత్య చేసుకుంది.
మహారాష్ట్రకు చెందిన అంజలి అనే విద్యార్థిని గత కొన్ని రోజులుగా ఢిల్లీలోని ఓల్డ్ రాజేందర్ నగర్‌లోని ఓ హాస్టల్లో ఉంటూ.. సివిల్ సర్వీసెస్ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో తీవ్ర ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది (Died By Suicide). ఈ మేరకు బలవన్మరణానికి ముందు ఓ నోట్కూడా రాసి పెట్టింది. ‘మమ్మీ, పాపా.. నన్ను క్షమించండి. నిజంగా నేను చాలా విసిగిపోయాను. ఇక్కడ కేవలం సమస్యలు మాత్రమే ఉన్నాయి. డిప్రెషన్ నుంచి బయటపడేందుకు సాధ్యమైనంత వరకూ ప్రయత్నించాను. కానీ, నా వల్ల కాలేదు’ అని సూసైడ్ నోట్ రాసి పెట్టి బలవన్మరణానికి పాల్పడింది.
ఈ ఘటనపై అంజలి స్నేహితురాలు శ్వేత మాట్లాడుతూ.. ‘అంజలి యూపీఎస్సీ ఎగ్జామ్‌ను మూడు సార్లు ప్రయత్నించారు. కానీ పరీక్షల్లో ఫలితం రాలేదు. దీంతో తీవ్రమైన ఒత్తిడికి లోనైంది. దానికి తోడు కొన్ని నెలలుగా పీజీల్లో అద్దె కూడా పెరుగుతుండటంతో ఆర్థిక పరిస్థితులు తనని చుట్టుముట్టాయి’ అని తెలిపింది. మరోవైపు ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ విషాద సంఘటనకు దారితీసిన పరిస్థితులపై విచారణ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
బేస్మెంట్లోకి వరద.. ముగ్గురు విద్యార్థులు జలసమాధి
కాగా, శనివారం రాత్రి 7 గంటల సమయంలో రావుస్ స్టడీ సర్కిల్ బేస్మెంట్లోకి ఒక్కసారిగా వరద నీరు చేరింది. ఈ సమయంలో బేస్మెంట్లో ఉన్న లైబ్రరీలో దాదాపు 18 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో 15 మంది ఎలాగోలా బయటపడగా, ముగ్గురు మాత్రం నీటిలో మునిగిపోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఢిల్లీ అగ్నిమాపక శాఖ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వచ్చి వారిని కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఈ ఘటనలో తెలంగాణలోని మంచిర్యాల జిల్లాకు చెందిన తాన్యా సోని(21), ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్ నగర్‌కు చెందిన శ్రేయ యాదవ్(25), కేరళలోని ఎర్నాకుళంకు చెందిన నవీన్ దల్వైన్(29) వరదనీటిలో మునిగి మరణించారు. లైబ్రరీ డోర్‌కు బయోమెట్రిక్ వ్యవస్థ ఉందని, ఇది లాక్ అయిపోవడం వల్లే వీరు బయటకు రాలేకపోయారని పలువురు విద్యార్థులు చెప్తున్నారు.
Also Read..
Kolkata | కోల్‌కతాను ముంచెత్తిన వర్షం.. ఎయిర్పోర్ట్ రన్‌వేపైకి చేరిన వర్షపు నీరు.. వీడియో
Pinarayi Vijayan | ముందస్తు హెచ్చరికల వ్యవస్థలను సవరించాల్సిన అవసరం ఉంది : సీఎం పినరయి విజయన్