Weather | ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 19 రాష్ట్రాల్లో రాగల మూడురోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ హెచ్చరించింది. కేరళ, గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌లోని సౌరాష్ట్ర, కచ్‌లో మంగళవారం భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ మేరకు ఆయా రాష్ట్రాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించింది. ఈ నెల 17, 18, 19 తేదీల్లో ఉత్తరాఖండ్, తూర్పు రాజస్థాన్, ఒడిశాలో వర్షాలు పడుతాయని పేర్కొంది. ఈ నెల 18, 19 తేదీల్లో ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాలకు ఆరెంజ్ అలెర్ట్‌ను జారీ చేసింది.
ఉత్తరప్రదేశ్, జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఈశాన్య, దక్షిణాది రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. గత 24 గంటల్లో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిశాయి. వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కేరళలోని ఏడు జిల్లాలు, కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సోమవారం పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. దక్షిణ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని భారీ వర్షాలు కురిశాయి. ఉత్తర్‌ప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్లో భారీ వర్షాల నేపథ్యంలో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా మాట్లాడారు. భారీ వర్షాల కారణంగా తలెత్తిన వరద పరిస్థితిపై సమీక్షించారు.