న్యూఢిల్లీ: విపత్తు నిర్వహణ సన్నద్ధతను మరింత పటిష్టపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తమైంది. రోజువారీ వాతావరణ సమాచారాన్ని గ్రామ పంచాయతీ స్థాయిలోనే అందజేసే సేవలను కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ (లలన్ సింగ్) గురువారం ప్రారంభించారు. భారత వాతావరణ శాఖ విస్తరించిన సెన్సర్ కవరేజ్ సహకారంతో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి. ఇటువంటి సేవలు స్థానికంగానే అందుబాటులోకి రావడం ఇదే తొలిసారి. ఈ మంత్రిత్వ శాఖకు చెందిన ఈ-గ్రామ్స్వరాజ్, మేరీపంచాయత్ యాప్, గ్రామ్ మన్చిత్ర డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా వాతావరణ సూచనలను పంపిస్తారు. తుపానులు, భారీ వర్షాలు వంటివి సంభవించే అవకాశం ఉన్నపుడు పంటలు, ఆస్తులు, ప్రజల ప్రాణాలను కాపాడటం కోసం ఎస్ఎంఎస్ అలర్ట్‌లను పంచాయతీ ప్రతినిధులకు పంపిస్తారు.