న్యూఢిల్లీ, జూలై 4: దేశంలో అధ్వాన్నంగా తయారైన విద్యావ్యవస్థ, ప్రశ్నా పత్రాల లీకేజ్‌కు వ్యతిరేకంగా ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ)తో కలిసి సోనం వాంగ్‌చుక్ చేపట్టిన నిరాహార దీక్ష శనివారం ఏడో రోజుకు చేరుకుంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి క్రమంగా దెబ్బ తింటున్నదని సీజేపీ వ్యవస్థాపకుడు దీప్కే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, ఆయన ఐదు కిలోల బరువు కోల్పోయారని దీప్కే మీడియాకు తెలియజేశారు. సీజీపీ చేపట్టిన నిరసనల్లో పాల్గొనేందుకు రైతు సంఘాల ఐక్య వేదిక ‘ఎస్కేఎం’ కూడా సంసిద్ధత వ్యక్తం చేసింది.
కేంద్రంలో మోదీ సర్కార్‌కు వ్యతిరేకంగా తాము విద్యార్థుల నిరసనకు మద్దతు పలుకుతున్నామని, ఆదివారం జంతర్ మంతర్ వద్ద సీజేపీతో కలిసి ఆందోళనల్లో పాల్గొంటామని ఎస్కేఎం ప్రకటించింది. ప్రశ్నా పత్రాల లీకేజ్‌లు దేశంలో 20మంది విద్యార్థుల మరణానికి కారణమయ్యాయని, అయినా కూడా కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ప్రధాని మోదీ క్యాబినెట్ నుంచి తొలగించక పోవడాన్ని దీప్కే తప్పుబట్టారు. ధర్మేంద్ర ప్రధాన్‌పై ప్రధాని ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించారు.