న్యూఢిల్లీ: స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని మహారాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సోమవారం స్పష్టం చేసింది. వచ్చే నెలలో నిర్వహించనున్న ఈ ఎన్నికల్లో ఈ పరిమితిని దాటి రిజర్వేషన్లను కల్పిస్తే, ఎన్నికలను నిలిపేయాలని ఆదేశాలిస్తామని హెచ్చరించింది. న్యాయస్థానం అధికారాలను పరీక్షించవద్దని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా విజ్ఞప్తి మేరకు తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. ఓబీసీ క్యాటగిరీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలని 2022లో జేకే బాంతియా కమిషన్ సిఫారసు చేసింది. దీనికి ముందు ఉన్న పరిస్థితి ప్రకారం ఎన్నికలు నిర్వహించుకోవచ్చునని సుప్రీంకోర్టు మే నెలలో ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాలను ప్రభుత్వ అధికారులు తప్పుగా అర్థం చేసుకున్నారని పిటిషనర్లు ఆరోపించారు. ఈ ఆరోపణలు సరైనవిగానే కనిపిస్తున్నాయని కోర్టు వ్యాఖ్యానించింది.