న్యూఢిల్లీ, మార్చి 23: తమ దేశ తీరంపైన కాని ద్వీపాల పైన కాని ఎటువంటి దాడులు జరిగినా పర్షియన్ గల్ఫ్ వ్యాప్తంగా పేలిపోయే సముద్ర మందుపాతరలను(సీ మైన్స్) మోహరించాల్సి వస్తుందని ఇరాన్ రక్షణ మండలి సోమవారం హెచ్చరించింది. ఇరాన్ తీర ప్రాంతం నుంచి నేరుగా మందు పాతరలు అమర్చే అవకాశం ఉన్నందున అటువంటి చర్య గల్ఫ్ నౌకా రవాణా మార్గాలు, సమాచార మార్గాలకు అంతరాయం కలగచేస్తుందని కూడా మండలి స్పష్టం చేసింది. ఇరాన్ తీరాలపై లేదా ద్వీపాలపై దాడి చేయడానికి చేసే ఏ ప్రయత్నమైనా సముద్ర మందు పాతరలతో గల్ఫ్‌లోని అన్ని ప్రవేశ మార్గాలను నింపేలా చేస్తుందని ఒక ప్రకటనలో మండలి పేర్కొన్నది. అదే జరిగితే హొర్ముజ్ జలసంధి తరహా పరిస్థితిలోనే సుదీర్ఘకాలం యావత్ గల్ఫ్ ఉంటుందని ఇరాన్ స్పష్ట చేసింది.
1980వ దశకంలో కొన్ని సముద్ర మందుపాతరలను తొలగించే ప్రయత్నంలో 100 మందికిపైగా కార్మికులు విఫలమయ్యారన్న విషయాన్ని మరచిపోరాదని కూడా మండలి గుర్తు చేసింది. హొర్ముజ్ జలసంధి వద్ద అమెరికా తన నౌకాదళ సిబ్బందిసహా యుద్ధ నౌకలను మోహరించనున్నట్లు ఇరాన్లో ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో మండలి ఈ ప్రకటనను విడుదల చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. యాక్సియోస్ కథనం ప్రకారం, హొర్ముజ్ జలసంధిని అన్ని రకాల నౌకాయానం కోసం తిరిగి తెరవాలని ఇరాన్‌పై ఒత్తిడి పెంచేందుకు ఇరాన్ ప్రధాన చమురు ఎగుమతి కేంద్రమైన ఖర్గ్ ద్వీపాన్ని ఆక్రమించడం లేదా దిగ్బంధించడం వంటి ప్రణాళికలను అమెరికా పరిశీస్తున్నది. ఈ యుద్ధంలో భూతల సైనిక చర్య కూడా చేపట్టవచ్చని ఇజ్రాయెల్ అమెరికాకు సూచించింది.
టెహ్రాన్‌లోని మౌలిక సదుపాయాల లక్ష్యాలపై విస్తృతమైన దాడులు ప్రారంభించినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. కాగా, ఇరాన్ బాలిస్టిక్ క్షిపణిని అబూ ధాబీలోని అల్ ధాఫ్రా ఎయిర్ బేస్ సమీపంలో యూఏఈ అడ్డుకుంది. క్షిపణి శకలాలు తగలడంతో ఒక వ్యక్తి గాయపడ్డాడు. బహ్రెయిన్, కువైట్‌లో హెచ్చరిక సైరన్లు మార్మోగగా రియాద్‌ను లక్ష్యంగా చేసుకున్న ఓ ఇరాన్ క్షిపణిని అడ్డుకున్నట్లు సౌదీ అరేబియా రక్షణ శాఖ తెలిపింది. చమురు నిక్షేపాలున్న తూర్పు ప్రావిన్సులో అనేక డ్రోన్లను కూల్చివేసినట్లు సౌదీ వెల్లడించింది. ఈ యుద్దంలో ఇప్పటివరకు 1,500కి పైగా మరణించినట్లు ఇరాన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది.

స్పెయిన్ ప్రధాని సూచించిన శాంతి సందేశాన్ని క్షిపణిపై ఇలా ముద్రించిన ఇరాన్ దాన్ని ఇజ్రాయెల్ పైకి మంగళవారం ప్రయోగించింది.