ఢిల్లీ : ఈనెల 28 నుంచి మధ్య ఆసియాలోని ద్వీప దేశం సైప్రస్‌లో నిర్వహించబోయే క్యాండిడేట్స్ టోర్నీ నుంచి వైదొలిగినందుకు గాను భారత గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. చుట్టూ యుద్ధ మేఘాలు కమ్ముకున్న చోట ప్రశాంతంగా ఆడటం అసాధ్యమని తెలిపిన ఆమె.. ఫిడే విధించే జరిమానాల గురించి భయం లేదని పేర్కొంది. ఇదే విషయమై సోమవారం ఆమె ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ.. ‘గత మూడు నెలల నుంచి ఈ టోర్నీ కోసం సిద్ధమవుతున్నా. నా కూతురుతో కూడా గడుపకుండా ఈ టోర్నీ కోసమే సన్నద్ధమయ్యా. అలాంటి నేను టోర్నీ నుంచి వైదొలిగానంటే ఏదో సరదా కోసమైతే కాదు కదా. చుట్టూ యుద్ధనౌకలు ఉన్న చోట మీరు ప్రశాంతంగా ఎలా ఆడగలరు?’ అని తెలిపింది.
16 మంది పాల్గొనబోయే ఈ టోర్నీ నుంచి హంపి ఒక్కతే వైదొలిగిన నేపథ్యంలో ఆమెపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫిడే కూడా ఆమెపై జరిమానా విధించే అవకాశమున్నట్టు వార్తలొస్తున్న నేపథ్యంలో ఆమె స్పందిస్తూ.. ‘వాళ్లు జరిమానాలు వేసినంత మాత్రానా నిజాలు మాట్లాడొద్దని కాదు. వాటి (ఫైన్) గురించి నేను భయపడటం లేదు. నేనేం డబ్బు కోసం ఆడటం లేదు’ అని ఘాటుగా సమాధానమిచ్చింది. లెబనాన్, ఇజ్రాయెల్ మధ్యలో ఉన్న ఈ ద్వీప దేశంపై ఇటీవల ఓ డ్రోన్ కూలడంపై సైప్రస్ అధ్యక్షుడు ఆందోళన వ్యక్తం చేసిన విషయాన్ని హంపి గుర్తుచేసింది.