న్యూఢిల్లీ, మార్చి 21: మరి కొన్ని రోజుల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు వామపక్షాలకు అత్యంత ప్రతిష్టాత్మకం కానున్నాయి. ప్రస్తుత బలాన్ని కాపాడుకోవడంతోపాటు గత దశాబ్ద కాలంలో కోల్పోయిన తమ ప్రాభవాన్ని పుంజుకోవడం ఈ ఎన్నికల్లో వామపక్షాలకు అత్యంత కీలకం. కేరళలో హ్యాట్రిక్ సాధించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న వామపక్షాలకు పశ్చిమ బెంగాల్లో తుడిచిపెట్టుకుపోయిన రాజకీయ ఉనికిని పునర్నిర్మించుకోవడం సవాలుగా మారింది. గడచిన రెండు ఎన్నికల్లో కేరళలో అధికారాన్ని చేజిక్కించుకున్న సీపీఎం సారథ్యంలోని లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్(ఎల్డీఎఫ్)కు వరుసగా మూడవసారి అధికారంలోకి రావడం ప్రతిష్టాకరంగా మారింది. పదేండ్ల ఎల్డీఎఫ్ సర్కారును గద్దె దించాలని కాంగ్రెస్ సారథ్యంలోని యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్(యూడీఎఫ్) తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. 140 అసెంబ్లీ స్థానాలు గల కేరళలో ఏప్రిల్ 9న పోలింగ్ జరగనున్నది.
పశ్చిమ బెంగాల్లో వరుసగా ఏడు పర్యాయాలు లేదా 34 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న లెఫ్ట్ ఫ్రంట్ 2011లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ చేతిలో ఓటమి పాలైంది. ఆ తర్వాతి నుంచి రాష్ట్రంలో వామపక్షాల ప్రాభవం పూర్తిగా క్షీణిస్తూ పోయింది. గడచిన పదేండ్లలో సీపీఎం ఓటు శాతం 40 నుంచి 5 శాతానికి పడిపోయి 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేని దుస్థితికి దిగజారిపోయింది. అయితే అధికార తృణమూల్ కాంగ్రెస్ వ్యతిరేక ఓటు వామపక్షాలు దక్కించుకుంటాయా? క్రమంగా బలాన్ని పుంజుకుంటున్న బీజేపీ ఖాతాలోకి అవి పడతాయా అన్నది వేచి చూడాల్సిందే. 2011లో 4.06 శాతం ఓట్లను దక్కించుకున్న బీజేపీ 2021నాటికి 37.97 శాతానికి తన బలాన్ని పుంజుకున్నది. బెంగాల్ రాజకీయాలను ఒకప్పుడు శాసించిన వామపక్షాలు, కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను ఆకట్టుకోవడంలో విఫలం కావడం బీజేపీకి లాభించింది.
2021 అసెంబ్లీ ఎన్నికల్లో కేరళలో ఎల్డీఎఫ్కు మొత్తం పోలైన ఓట్లలో 45.3 శాతం ఓట్లు లభించాయి. రాష్ట్రంలోని మొత్తం 140 సీట్లలో 99 స్థానాలను ఎల్డీఎఫ్ గెలుచుకుంది. గడచిన నాలుగు దశాబ్దాలుగా ఒక ప్రభుత్వం వరుసగా రెండవసారి అధికారంలోకి రావడం కూడా ఇదే మొదటిసారి. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో 43 శాతం ఓట్లతో 91 స్థానాల్లో ఎల్డీఎఫ్ విజయం సాధించింది. అయితే లోక్సభ ఎన్నికల్లో మాత్రం వామపక్షాల తీరు పేలవంగా ఉంది. 2019 లోక్సభ ఎన్నికల్లో 32% ఓట్లతో రాష్ట్రంలో కేవలం ఒకే ఒక్క స్థానాన్ని లెఫ్ట్ ఫ్రంట్ గెలుచుకుంది.
2024 ఎన్నికల్లో సైతం రాష్ట్రంలోని 20 లోక్సభ స్థానాల్లో ఒకే ఒక్క స్థానం ఎల్డీఎఫ్కు దక్కింది. ఒకప్పుడు తనకు అత్యంత బలమైన పునాదులు ఉన్న బెంగాల్లో వామపక్షాలు క్రమంగా బలహీనపడిపోయి చివరకు తమ ఉనికే కోల్పోయే పరిస్థితి నెలకొంది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 26 శాతం ఓట్లను సాధించుకున్న వామపక్షాలు 22 సీట్లను గెలుచుకున్నాయి. కాని 2021 అసెంబ్లీ ఎన్నికల్లో లెఫ్ట్-కాంగ్రెస్ కూటమి ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయింది. 2019, 2024 లోక్సభ ఎన్నికల్లో సైతం లెఫ్ట్ ఫ్రంట్ ఒక్క స్థానం కూడా గెలవలేదు.