Water Purifier | హైదరాబాద్, సెప్టెంబర్ 21 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): నల్లా నీటి కంటే ప్యూరిఫైర్ నీరు ఆరోగ్యానికి మంచిదని మనం తాగుతూ ఉంటాం. ఆర్వో, యూవీ, ఆల్కలైన్ తదితర వెరైటీల పేరిట మార్కెట్లో ఎన్నో ప్యూరిఫైర్లు లభిస్తున్నాయి. అయితే, ప్యూరిఫైర్లు నీటిని శుద్ధిచేసే క్రమంలో శరీరానికి అత్యవసరమైన మెగ్నీషియం వంటి ఖనిజాలను కూడా వడపోస్తున్నట్టు ఇజ్రాయెల్ పరిశోధకుల తాజా అధ్యయనంలో తేలింది. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం.. ప్రతీ లీటర్ నీటిలో 40 నుంచి 81 మిల్లీగ్రాముల మెగ్నీషియం అనేది కచ్చితంగా ఉండాలి.
అయితే, మార్కెట్లో లభిస్తున్న చాలా ప్యూరిఫైర్ల నీటిలో అసలు మెగ్నీషియం కనిపించట్లేదని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ వివరాలు ‘నేచర్ జర్నల్’లో ప్రచురితమయ్యాయి. శరీరానికి తగినంత మెగ్నీషియం అందకుంటే నాడీ సంబంధిత వ్యాధులతో పాటు మెదడుకు రక్త ప్రవాహంలో సమస్యలు, టైప్-2 డయాబెటిస్, డిమెన్షియా వచ్చే ప్రమాదముందని పరిశోధకులు హెచ్చరించారు. మెగ్నీషియం ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడంతో పాటు మెగ్నీషియం ఖనిజాన్ని వడబోయని ప్యూరిఫైర్ను చూసి కొనుగోలు చేయడం మంచిదని నిపుణులు సూచించారు.