K Krishnasamy : అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) వేళ తమిళనాడు (Tamil Nadu) లో పార్టీలు పొత్తులు, ఎత్తులతో బిజీబిజీగా ఉన్నాయి. ఈ క్రమంలో కే క్రిష్ణసామి (K Krishnasamy) నేతృత్వంలోని పుతియ తమిళగం పార్టీ (PTP) ఎన్డీఏ వీడనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ఆ పార్టీ చీఫ్ క్రిష్ణసామినే స్వయంగా సంకేతాలిచ్చారు. బుధవారం కోయింబత్తూరు (Coimbator) లో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలో దిగనున్నట్లు చెప్పారు.
తాము టెంకాసీ, తిరునెల్వేలి, విరుదునగర్, రామ్నాథపురం, మధురై, దిండిగుల్ రిజియల్, ముఖ్యంగా అర్బన్, సెమీ అర్బన్ ఏరియాల్లో పెద్ద సంఖ్యలో ఉన్న అట్టడుగువర్గాల ప్రజల సంక్షేమం కోసం పని చేస్తామని క్రిష్ణసామి ప్రకటించారు. ఆయా ప్రాంతాల్లో తాము ఐదేళ్ల డీఎంకే పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని చెప్పారు.
అదేవిధంగా ఏఐఏడీఎంకే, ఎన్డీఏ భాగస్వామ్యపక్షాలతో చర్చలను నిలిపివేశామని క్రిష్ణసామి తెలిపారు. ఆయా పార్టీలు తక్కువ సీట్లను ఆఫర్ చేస్తుండటంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఒంటరిగానే బరిలో దిగబోతున్నామని చెప్పారు. క్రిష్ణసామి పార్టీ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి పార్టీగా, 2024 లోక్సభ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే నేతృత్వంలోని కూటమి పార్టీగా బరిలో దిగింది.