న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: భారత దేశం ప్రస్తుతం విశ్వ గురు కాదని, ఆ పదాన్ని ఉపయోగించకూడదని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి మురళీ మనోహర్ జోషి పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ అనుబంధంగా ఉన్న సంస్కృత భారతి కేంద్ర కార్యాలయ ప్రారంభోత్సవం సోమవారం ఢిల్లీలో జరిగింది. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో జోషి మాట్లాడారు. సంస్కృత భాషను భారత అధికార భాషగా చేయాలన్న దృఢ అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. అంబేద్కర్ సహా పలువురు గతంలో దీని కోసం ప్రయత్నాలు చేశారని, అయితే ఆ ప్రతిపాదనలు స్పష్టంగా లేవని అన్నారు. సంస్కృత భాష ప్రచారం గురించి మీ అభిప్రాయం ఏంటని మీడియా ప్రశ్నించగా.. ‘మనం. విశ్వ గురువులం అనే భావన ఉంది. ప్రస్తుతం మనం విశ్వ గురువులం కాదు. మనం విశ్వం గురువులం కావాలని ఆకాంక్షించాలి. నిజానికి ఒకప్పుడు మనం విశ్వ గురువులమే. అయితే నేటి వాస్తవం ఏమిటంటే మనం అలా లేము’ అని ఆయన పేర్కొన్నారు. విశ్వ గురు స్థానంపై మురళీ మనోహర్ జోషి చేసిన వ్యాఖ్యలు బీజేపీని ఇరుకున పెట్టినట్టు ఉన్నాయని విమర్శకులు తెలిపారు.