వయనాడ్, జూలై 30: కేరళలో ఘోర ప్రకృతి విపత్తు సంభవించింది. వయనాడ్ జిల్లాలోని మెప్పడి, చూరల్మల గ్రామాలతో పాటు ముండక్కై పట్టణంపై కొండచరియలు విరుచుకుపడ్డాయి. మంగళవారం తెల్లవారు జామున 2 గంటల నుంచి 6 గంటల మధ్య మూడుసార్లు కొండచరియలు తెగిపడ్డాయి. దీంతో వందలాది ఇండ్లు, దుకాణాలు నేలమట్టమయ్యాయి. 133 మంది మరణించినట్టు అధికారులు గుర్తించారు. 128 మంది తీవ్రంగా గాయపడి దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 481 మందిని రక్షించారు. అయితే, వందలాది మంది ఆచూకీ తెలియడం లేదు. చాలా ఇండ్లు వరద, బురదలో మునిగిపోయాయి. వీటిల్లో చిక్కుకున్న ప్రజలు తమను కాపాడమని హాహాకారాలు చేస్తున్నారు. పదుల సంఖ్యలో మృతదేహాలు, మనుషుల శరీర అవయవాలు చలియార్ నదిలో కొట్టుకుపోతున్నాయి. ఇక్కడి తోటల్లో పని చేసేందుకు అస్సాం, పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన దాదాపు 600 మంది ఆచూకీ తెలియడం లేదు. ప్రాణనష్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రకృతి అందాలకు చిరునామాగా ఉండే ఈ ప్రాంతమంతా ఇప్పుడు విపత్తు సృష్టించిన విలయంతో హృదయవిదారకంగా మారింది.
సోమవారం నుంచి వయనాడ్ ప్రాంతంలో తీవ్ర వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మంగళవారం తెల్లవారుజామున 2 గంటల నుంచి 6 గంటల మధ్య మెప్పడి, చూరల్మల గ్రామాలతో పాటు ముండక్కై పట్టణంలో కొండచరియలు మీద పడ్డాయి. ముండక్కై పట్టణంలోని రెండు వార్డుల్లో వందలాది ఇండ్లు నేలమట్టమయ్యాయి. చూరల్మల గ్రామంలో చాలా భాగం పూర్తిగా కొట్టుకుపోయింది. ముండక్కై, చూరమల, అట్టమల, నూల్పుజ తీవ్రంగా దెబ్బతిన్నాయి.
కొండచరియలు విరిగిపడటం వల్ల జరిగిన నష్టానికి తోడు వరద కూడా మరింత విలయాన్ని మిగిల్చింది. కొండల మీదుగా విరిగిపడ్డ శిథిలాలు నీటి ప్రవాహంలో పడటం, భారీ వర్షాల కారణంగా ఎగువ కొండల నుంచి వరద ఒక్కసారిగా పోటెత్తడంతో చాలా ఇండ్లు, దుకాణాలు, వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి. వందలాది ఇండ్లు బురదలో మునిగిపోయాయి. వీటిల్లో చిక్కుకుపోయిన వారు బయట ఉన్న వారికి ఫోన్లు చేసి కాపాడాలని విలపిస్తూ వేడుకుంటున్నారు.
కొండచరియలు పడటం, వరద వల్ల చూరల్మల బ్రిడ్జి, ముండక్కై బ్రిడ్జి కూలిపోయాయి. ముండక్కైకి వెళ్లే రహదారిపై కూడా భారీగా కొండచరియలు పడిపోయాయి. దీంతో ఈ ప్రాంతాలకు చేరుకునేందుకు రోడ్డుమార్గం పూర్తిగా తెగిపోయింది. చివరకు రోప్‌లు వేసుకొని సహాయక సిబ్బంది ప్రభావిత ప్రాంతాలకు చేరుకున్నారు.
2020లోనూ ముండక్కైలో తక్కువ తీవ్రతతో కొండచరియలు విరిగిపడ్డాయి. సోమవారం నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని స్థానిక అధికార యంత్రాంగం ప్రజలను అప్రమత్తం చేసింది. దీంతో దాదాపు 200 మంది ఇండ్లను వదిలి ముండక్కైలోని ఓ రిసార్ట్, మద్రస్సాలో తలదాచుకొని ప్రాణాలు దక్కించుకున్నారు.
అధికారులు అప్రమత్తం చేసినా కొందరు ఇండ్లు వీడకుండా ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నారు. శ్లాబ్‌తో ఇండ్లు ఉన్న వారు సురక్షిత ప్రాంతాలకు రాలేదని, ఆ ఇండ్లన్నీ ఇప్పుడు కూలిపోయాయని మెప్పడి పంచాయతీ ప్రసిడెంట్ కే బాబు చెప్పారు. ‘11 గంటలకు మేము ఇంటి నుంచి బయటకు వచ్చేసినప్పుడు మా పక్కింటి వ్యక్తినీ రమ్మనిచెప్పినా రాలేదు. ఇప్పుడు ఆయన ఉన్న ఇల్లు కొట్టుకుపోయింది’ అని ఓ వ్యక్తి వాపోయారు.
వెల్లరిమల్లలో సహాయ శిబిరం ఏర్పాటు చేసిన ప్రభుత్వ పాఠశాలపైనా కొండచరియలు విరిగిపడ్డాయి. లోపల చిక్కుకున్న వారు తమను కాపాడమని ఫోన్లు చేసి వేడుకుంటున్నారని, వాయిస్ క్లిప్స్ వస్తున్నాయని ఈ పాఠశాల టీచర్ ఒకరు చెప్పారు.
ప్రభావిత ప్రాంతాల్లో మంగళవారం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖ సిబ్బందితో పాటు ఆర్మీ, నేవీ సిబ్బంది కూడా సహాయక చర్యలు ప్రారంభించారు. అయితే, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా హెలికాప్టర్లతో సహాయక చర్యలు చేపట్టలేకపోతున్నారు.
మంగళవారం సాయంత్రం 5 గంటల సమయానికే ఈ ప్రాంతంలో చీకటి నెలకొన్నది. విద్యుత్తు సరఫరా కూడా లేకపోవడం వల్ల మంగళవారం సాయంత్రం సహాయక చర్యలు చాలావరకు నిలిచిపోయాయి. అయితే, కొండచరియలు విరిగిపడే ముప్పు ఇప్పటికీ కొనసాగుతున్నా సిబ్బంది ధైర్యంగా ప్రజల ప్రాణాలను కాపాడేందుకు శ్రమిస్తున్నారు.
వయనాడ్ విలయానికి ప్రకృత్రి ప్రకోపమే కారణమని వాతావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కేరళలో స్వల్ప వ్యవధిలో దట్టమైన మేఘాలు ఏర్పడటం, అతిభారీ వర్షాలు కురవడానికి అరేబియా సముద్రం, ముఖ్యంగా ఆగ్నేయ అరేబియా వేడెక్కడం ప్రధాన కారణమని అభిప్రాయపడుతున్నారు. వర్షాలతో నేల మొత్తం తడిగా మారిందని, ఇదే సమయంలో దట్టమైన మేఘాలు ఏర్పడి భారీ వర్షాలు కురవడంతో కొండచరియలు విరిగిపడ్డట్టు వాతావరణ శాస్త్రవేత్త అభిలాష్ తెలిపారు.
వయనాడ్ ప్రాంతంలో సోమవారం నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ కనుమల్లో గత 48 గంటల్లో 572 ఎంఎం వర్షపాతం నమోదయ్యింది. దీంతో వాగులు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చలియార్ నది ఉగ్రరూపం దాల్చింది. ఇరువఝింజిపుజ నది రెండుగా చీలిపోయి ప్రవహిస్తున్నది. దీంతో అనేక గ్రామాలు వరద ముంపునకు గురవుతున్నాయి. బుధవారం కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
కేరళ చూసిన తీవ్రమైన ప్రకృతి విపత్తుల్లో ఇది ఒకటని ముఖ్యమంత్రి పినరయి విజయన్ పేర్కొన్నారు. వయనాడ్ విలయంలో ధ్వంసమైన ప్రజల జీవితాలు, జీవనోపాధిని పునర్నిర్మించేందుకు కలిసిరావాలని ఆయన ప్రజలను కోరారు. 2018 నాటి వరదల నుంచి రాష్ర్టాన్ని పునర్నిర్మించుకున్నట్టుగానే ఇప్పుడు కూడా చేతులు కలపాలని ఆయన పిలుపునిచ్చారు. సీఎం డిస్ట్రెస్ రిలీఫ్ పండ్‌కు సాయం అందించాలని కోరారు. వయనాడ్ జిల్లాలో 45 సహాయక శిబిరాలను ఏర్పాటు చేశామని, 3,000 మందిని తరలించినట్టు ఆయన చెప్పారు.
వయనాడ్ ఘటనపై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా విచారం వ్యక్తం చేశారు. కేరళ సీఎం విజయన్‌కు ఫోన్ చేసి ఘటనపై ఆరా తీశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడ్డ వారికి రూ.50,000 ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్టు ప్రధాని ప్రకటించారు.