Wayanad Landslide : కేరళ (Kerala) లోని వయనాడ్ (Wayanad district) జిల్లాలో రెస్క్యూ ఆపరేషన్ (Rescue operation) ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటికే 350కి పైగా మృతదేహాలను రెస్క్యూ టీమ్స్ వెలికి తీశాయి. మరో 250 మంది ఆచూకీ ఇప్పటికీ లభ్యం కాలేదు. దాంతో వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదం నుంచి బయటపడిన సుజాత అనినంచిర (Sujata Aninanchira) అనే మహిళ తన కుటుంబాన్ని ఏనుగుల మంద కాపాడిన విషయాన్ని మీడియాతో పంచుకున్నారు.
‘మాది చూరల్మాలా గ్రామం. ఆ రోజు రాత్రి అకస్మాత్తుగా వరద వచ్చింది. ఒకవైపు నుంచి కొండచరియలు దొర్లి వచ్చాయి. వరదలో మా ఇల్లు కొట్టుకుపోయింది. భయంతో మేం ప్రాణాలు కాపాడుకునేందుకు కొండపైకి వెళ్లాం. అక్కడ చిమ్మచీకటిగా ఉంది. ఏమీ కనిపించడం లేదు. కొద్ది నిమిషాలకు తేరిపార చూస్తే మా పక్కనే ఏనుగుల మంద ఉన్నది. వాటికి మాకు ఒక మీటర్ దూరం మాత్రమే ఉన్నది. ఒక్కసారిగా గుండె గుబేల్మన్నది. కిందకు వెళ్తే వరదలు. పైన ఉంటే ఏనుగులు.’ అంటూ ఆమె తమ పరిస్థితిని వెల్లడించారు.
ఇంకా ఆమె కొనసాగిస్తూ.. ‘మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. భయపడుతూనే ఏనుగులను వేడుకున్న. ‘మమ్మల్ని ఏమి చేయవద్దు. ఈ రాత్రికి ఇక్కడే ఉండనివ్వండి.’ అని చేతులెత్తి మొక్కుకున్నా. ఏనుగులు కూడా వరద ప్రవాహాన్ని చూసి భయంగానే కనిపించాయి. మమ్మల్ని అర్థం చేసుకున్నాయి. అందుకే తెల్లవారేదాకా మాకు కాపలాగా ఉన్నాయి. రాత్రంతా వాటి కాళ్ల దగ్గరే మేం ఉన్నాం. రెస్క్యూ టీమ్స్ వచ్చే వరకు అవి మా పక్కనే ఉన్నాయి’ అని సుజాత చెప్పారు.