న్యూఢిల్లీ, మే 16: వచ్చే వందేండ్లలో నీటిఎద్దడి అన్నదే తలెత్తకుండా తెలంగాణ సర్కారు ముందస్తు చర్యలు తీసుకుంటున్నది. అయితే దేశానికే రాజధాని అయిన ఢిల్లీలో నీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు చేపట్టడంలో అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు ఢిల్లీ సర్కారు పూర్తిగా విఫలమయ్యాయి. ప్రధాని కూర్చొని పాలించే ఢిల్లీలో నీటి కష్టాలకు చెక్ పెట్టలేని బీజేపీ పెద్దలు.. తెలంగాణకు నీరిస్తామంటూ బడాయికి పోతున్నారు. ఒకవైపు మండుతున్న ఎండలు, మరోవైపు నీటి ఎద్దడితో రాజధాని వాసులు అల్లాడిపోతున్నారు. యమునా నదిలో నీరు అడుగంటిపోవడంతో పరిస్థితి దిగజారింది. వజీరాబాద్, చంద్రావాల్, ఓక్లా ప్రాంతాల్లోని నీటిశుద్ధి ప్లాంట్లలో ఉత్పత్తి తగ్గిపోయింది. ఈ ప్లాంట్ల నుంచి నీటి సరఫరా దాదాపు 40 శాతం మేర తగ్గిపోయిందని అధికారులు చెబుతున్నారు. ఢిల్లీవాసులకు ప్రధానంగా నీటిని సరఫరా చేసే వజీరాబాద్ రిజర్వాయర్లో నీటి మట్టం 669.40 అడుగులకు పడిపోయిందని, ఈ ఏడాది ఇదే కనిష్టమని వివరించారు.