మైసూరు, మే 2: కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో వేసవి తీవ్రత గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో వివిధ జిల్లాల్లోని వెయ్యికి పైగా బోరు బావుల్లోని నీటి మట్టం తగ్గిపోయింది. రాయచూరు, శివమొగ్గ జిల్లాల్లోని బోరు బావులపై వేసవి తీవ్రత తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఉత్తర కన్నడ, తుమకూరు, విజయపుర సహా అనేక ఇతర జిల్లాలు తీవ్ర నీటి సమస్యను ఎదుర్కొంటున్నట్లు గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ వర్గాలు తెలిపాయి. రాయచూరు, శివమొగ్గ జిల్లాల్లో 150కి పైగా గ్రామాలూ నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. ఉత్తర కన్నడ, తుమకూరు, విజయపుర జిల్లాల్లోనూ గ్రామాలను నీటి సమస్యలు వెంటాడుతున్నాయి. కొప్పల్, దావణగెరె, మండ్య, బళ్లారి, చిక్కమగళూరు జిల్లాల్లో వందకుపైగా గ్రామాల చొప్పున నీటి కష్టాలు పడుతున్నాయి. నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా జరుగుతున్నది.