అయోధ్య: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అయోధ్య నగరంలో అత్యద్భుతంగా నిర్మించిన రామ మందిరంలో భారీ కంచు గంటను ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 613 కిలోల బరువున్న ఈ పేద్ద కంచు గంటను రామేశ్వరానికి చెందిన భక్తురాలు, లీగల్ రైట్స్ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి మండా రాజ్యలక్ష్మి రామేశ్వరంలోనే జై శ్రీరామ్ పేరుతో తయారు చేయించారు. అంతేగాక రామ రథయాత్ర పేరిట ఈ గంటను ఇప్పటికే ప్రత్యేక వాహనంలో అయోధ్యకు తరలించారు.
ఈ రామ రథయాత్ర సెప్టెంబరు 17న మొదలై 21 రోజుల పాటు 11 రాష్ట్రాల మీదుగా 4,555 కిలోమీటర్ల దూరం ప్రయాణించి అక్టోబర్ తొలి వారంలో అయోధ్యకు చేరుకుంది. రామ రథయాత్ర ప్రారంభానికి ముందు రామేశ్వరంలోని రామ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొత్తం 4.13 అడుగుల పొడవు, 3.9 అడుగుల వెడల్పు ఉన్న ఈ భారీ కంచు గంటను మోగిస్తే ‘ఓం’ శబ్ధం కొన్ని కిలోమీటర్ల దూరం వినిపిస్తుందని పండితులు చెబుతున్నారు.
రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు, వినాయకుడి ప్రతిమలతోపాటు జై శ్రీరామ్ అనే అక్షరాలు పెద్దగా ముద్రించి ఉన్న ఈ గంటను దాత రాజ్యలక్ష్మి.. రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు అందజేశారు. రామాలయానికి భారీ కంచు గంటను కానుకగా ఇవ్వడం తనకెంతో సంతోషంగా ఉందని, దైవకార్యంలో అవకాశం కల్పించినందుకు ఆనందంగా ఉందని రాజ్యలక్ష్మి చెప్పారు. గంటపై ఉన్న ఐదు ప్రతిమల బరువు 210 కిలోలు ఉంటుందని ఆమె తెలిపారు.
#WATCH | Uttar Pradesh: Visuals of the temple bell weighing 600 kg that is going to be installed at Ayodhya’s Ram temple. pic.twitter.com/SJmB9PWUUt
— ANI (@ANI) December 28, 2023