Ram Charan | తొలి గ్లింప్స్ నుంచే అందరిలో ఆసక్తిని రేకెత్తించిన సినిమా రామ్ చరణ్ పెద్ది. తొలి సినిమా ‘ఉప్పెన’తో విజయాన్ని అందుకున్న బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం భారీ అంచనాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చింది. మెగా అభిమానులు, సినిమా యూనిట్ మాత్రమే కాదు.. మొత్తం సినీ పరిశ్రమ పెద్దిపై చాలా నమ్మకాలు పెట్టుకుంది. సంక్రాంతి తర్వాత ఏర్పడిన బాక్సాఫీసు సక్సెస్ గ్యాప్ ని పెద్ది భర్తీ చేస్తుందని, మళ్ళీ ఆడియన్స్ ని పెద్ద ఎత్తున థియేటర్స్ కి రప్పించగల సినిమా పెద్దినే అనే నమ్మకం అందరిలో కనిపించింది. మేకర్స్ కూడా ఎక్కడ రాజీపడకుండా పాన్ ఇండియా స్థాయిలో సినిమాని ప్రమోట్ చేశారు. పెద్ది తన కెరీర్ నెంబర్ వన్ అవుతుందని చరణ్ పదేపదే చాలా నమ్మకంగా చెప్పారు. ఇలా భారీ హైప్ తో సినిమాని ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఇన్ని అంచనాలు, ఆశలు, నమ్మకాలతో వచ్చిన పెద్ది కథ ఏమిటి? పెద్ది అంచనాలని అందుకున్నాడా? రివ్యూ లో చూద్దాం.
కథ : పెద్ది (రామ్ చరణ్) విజయనగరం సమీపంలోని ఓ కొండ కింద ఉన్న ఆదివాసీ గ్రామానికి చెందిన యువకుడు. ప్రభుత్వ రికార్డుల్లో గుర్తింపు లేని ఆ గ్రామ ప్రజలు ఎన్నో సమస్యలతో జీవనం సాగిస్తుంటారు. పెద్ది విజయనగరంలోని ఓ చెరుకు ఫ్యాక్టరీలో చేస్తుంటాడు. అదే సమయంలో మంచి క్రికెటర్ కూడా. స్థానిక టోర్నమెంట్లలో అతని ఆటకు ఉన్న క్రేజ్ కారణంగా జట్లు వేలం పాటలో అతడిని తీసుకుని ఆడిస్తుంటాయి మరోవైపు, కొండకింద గ్రామానికి గుర్తింపు తీసుకురావాలని, తమ ఊరికి ఒక రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయించాలని అప్పలసూరి (జగపతిబాబు) నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇలాంటి సమయంలో ఊహించని ఒక ఘటన పెద్ది జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఆ ఘటన ఏమిటి? తన ఊరికి, తన ప్రజలకు గుర్తింపు తీసుకురావడానికి పెద్ది ఎలాంటి పోరాటం చేశాడు? చివరకు తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడు? అన్నదే మిగతా కథ.
విశ్లేషణ: తన గ్రామానికి, అక్కడి ప్రజలకు గుర్తింపు తీసుకురావడానికి ఓ కుర్రాడు చేసిన పోరాటమే ‘పెద్ది’. క్రీడా నేపథ్యంతో స్ఫూర్తిని కలిగించే కథతో దర్శకుడు బుచ్చిబాబు సానా ‘పెద్ది’ని తీర్చిదిద్దడంలో సక్సెస్ అయ్యాడు. పెద్ది పాత్ర పరిచయం, క్రికెట్ టోర్నమెంట్, ‘రైరై రారా’, ‘చికిరి’ పాటలు ఫస్ట్ హాఫ్‌లో హైలెట్‌గా నిలిచాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. ‘పెద్ది’ సెకండ్ హాఫ్ ఎమోషనల్‌గా ఆకట్టుకుంది. కుస్తీ కోసం చరణ్ శిక్షణ, ఢిల్లీ ఎపిసోడ్స్ అన్నీ ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించేలా ఉంటాయి. ఇక చివరి నలభై నిమిషాలు ఎమోషన్స్ మరో స్థాయికి వెళ్తాయి. పెద్ది పాత్ర తీసుకునే ఓ నిర్ణయం మనసును హత్తుకునేలా ఉంటుంది. మంచి సందేశాత్మక క్లైమాక్స్‌తో కథను ముగించిన తీరు కూడా ఆకట్టుకుంది. అయితే ‘పెద్ది’లో లోపాలు లేకపోలేదు. ఫస్ట్ హాఫ్ కాస్త ల్యాగ్ అయ్యింది. చరణ్-జాన్వి ట్రాక్ సరిగ్గా పండలేదు. సెకండ్ హాఫ్‌లో సందేశాలు ఎక్కువయ్యాయి. అయినప్పటికీ క్లైమాక్స్‌ను బలంగా తీర్చిదిద్దడంతో ప్రేక్షకుడు ఒక మంచి ఇంప్రెషన్‌తోనే బయటకు వస్తాడు.
నటీనటుల నటన: రామ్ చరణ్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. పెద్ది పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. సినిమా మొత్తం పెద్ది పాత్రే కనిపిస్తుంది. ముఖ్యంగా ఎమోషనల్ క్లైమాక్స్‌లో తన నటన మరో స్థాయిలో ఉంటుంది. తన పడ్డ కష్టం తెరపై కనిపించింది. క్రికెటర్, రెజ్లర్, రన్నర్‌గా తన క్రాస్ఓవర్ గేమ్స్ ప్రత్యేకంగా నిలిచాయి. ‘పెద్ది’ చరణ్ వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. జాన్వి పాత్ర ఈ కథకు అంతగా అతకలేదు. డ్యాన్స్‌లలో, గ్లామర్‌లో మాత్రం ఆకట్టుకుంది. జగపతిబాబు చేసిన అప్పలసూరి పాత్ర గుర్తుండిపోతుంది. నిజానికి ‘పెద్ది’లో అసలు కథ అప్పలసూరిదే. సూరి సంకల్పాన్ని పెద్ది ముందుకు తీసుకెళ్తాడు. శివరాజ్‌కుమార్ కోచ్ పాత్రలో హుందాగా కనిపించారు. దివ్యేందు శర్మ రెండు మూడు సన్నివేశాల్లో మెరుస్తాడు. కాకపోతే తన పాత్ర కూడా కథలో సరిగ్గా భాగం కాలేదు. బోమన్ ఇరానీ తన అనుభవాన్ని చూపించారు. రావు రమేష్, శ్రీకాంత్ అయ్యర్, జాన్ విజయ్ పాత్రలు పరిధి మేరకు ఉన్నాయి.
సాంకేతిక వర్గం: రెహమాన్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఒక హాలీవుడ్ సినిమా చూస్తున్నంత స్థాయిలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను అందించారు. బీజీఎం మరో స్థాయిలో వినిపించింది. పాటలన్నీ థియేటర్లలో చూడటానికి కూడా బాగున్నాయి. రత్నవేలు కెమెరా వర్క్ మరో ఆకర్షణ. 1985 నాటి వాతావరణాన్ని ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ సహజంగా తీసుకొచ్చారు. కాకపోతే నవీన్ నూలి ఎడిటింగ్ ఇంకాస్త పదునుగా ఉండాల్సింది. వృద్ధి సినిమాస్ అధినేత సతీష్ కిలారు తన తొలి చిత్రాన్ని మంచి నిర్మాణ విలువలతో రూపొందించారు. ఎక్కడా రాజీ పడని నిర్మాణం కనిపించింది.
ప్లస్ పాయింట్స్:
రామ్ చరణ్
ఎమోషన్స్
మ్యూజిక్
క్లైమాక్స్
మైనస్ పాయింట్స్:
ఫస్ట్ హాఫ్‌లో కొన్ని సన్నివేశాలు
జాన్వి కపూర్ పాత్ర అంత బలంగా లేకపోవడం
ఫైనల్‌గా: ఒక స్ఫూర్తిదాయకమైన సినిమాను అందించడంలో దర్శకుడు బుచ్చిబాబు పైచేయి సాధించాడు. ‘పెద్ది’తో రామ్ చరణ్ ప్రేక్షకులకు ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారు.
రేటింగ్: 3.25/5