న్యూఢిల్లీ, మే 21: వక్ఫ్ అంటే కేవలం దాతృత్వం మాత్రమేనని, ఇస్లాంలో వక్ఫ్ ముఖ్యమైన పాత్ర కాదని కేంద్ర ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టుకు తెలియచేసింది. వక్ఫ్ బోర్డులు కేవలం లౌకిక విధులు నిర్వహిస్తాయని కేంద్రం స్పష్టం చేసింది. మతపరమైన విధులు నిర్వహించే ఆలయ పాలనకు ముస్లింలకు సబంధించిన వక్ఫ్‌కు పోలిక లేదని కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు విన్నవించారు. వక్ఫ్ ఓ ఇస్లామిక్ భావన. అయితే అది ఇస్లాంలో ముఖ్యమైన భాగం కాదు. వక్ఫ్ కేవలం ఇస్లాంలో ఓ దానం మాత్రమే.
దానం అనేది అన్ని మతాలలో భాగమని గత తీర్పులు చెబుతున్నాయి. అది క్రైస్తవంలో కూడా ఉంటుంది. హిందువులలో కూడా దానం అనే విధానం ఉంది. సిక్కులకు కూడా ఉంది అని మెహతా వాదించారు. చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం రెండవ రోజు వక్ఫ్ చట్టంపై దాఖలైన పిటిషన్లపై విచారణ కొనసాగించింది. మొదటి రోజు పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ ఎం సింఘ్వీ తమ వాదనలు వినిపించగా రెండవరోజున ప్రభుత్వం తరఫున తుషార్ మెహతా వాదనలు వినిపించారు.
వివాదాస్పద వక్ఫ్ బై యూజర్ సూత్రం కింద వక్ఫ్‌గా ప్రకటించిన ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకునే అధికారం కేంద్రానికి ఉందని మెహతా వాదించారు. ప్రభుత్వ భూమిపై ఎవరికీ అధికారం ఉండదు. వక్ఫ్ ఆస్తిగా ప్రకటించిన ప్రభుత్వానికి చెందిన భూమిని కూడా కాపాడే అధికారం ప్రభుత్వానికి ఉందని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఉంది అని మెహతా తెలిపారు.
కొత్త చట్టంలో తొలగించిన వక్ఫ్ బై యూజర్ నిబంధన ప్రకారం ఎటువంటి ధ్రువీకరణ పత్రాలు లేనప్పటికీ సుదీర్ఘ కాలం మతపరమైన, దాతృత్వ కార్యక్రమాల కోసం ఉపయోగించే ఆస్తుని వక్ఫ్‌గా పరిగణించాల్సి ఉంటుంది. వక్ఫ్ బై యూజర్ ప్రాథమిక హక్కు కాదని తుషార్ మెహతా స్పష్టం చేశారు. బ్రిటిష్ ప్రభుత్వం, ఆ తర్వాత వచ్చిన భారత ప్రభుత్వాలు పరిష్కరించలేని సమస్యలను కూడా వక్ఫ్ చట్టం తీసుకువచ్చిన సవరణలు పరిష్కరించాయని ధర్మాసనానికి మెహతా తెలిపారు.