Wakf Bill | లోక్సభ వక్ఫ్ సవరణ బిల్లును బుధవారం రాత్రి ఒంటిగంట ప్రాంతంలో ఆమోదించింది. బిల్లుకు అనుకూలంగా 288 మంది సభ్యులు ఓటు వేయగా.. వ్యతిరేకంగా 232 ఓట్లు వచ్చాయి. ప్రతిపక్షం చేసిన అన్ని సవరణలను కూడా సభ వాయిస్ ఓటు ద్వారా తిరస్కరణకు గురయ్యాయి. ప్రతిపక్ష ఎంపీ ఎన్కే ప్రేమచందన్ చేసిన సవరణ ప్రతిపాదనలపై తెల్లవారు జామున 1.15గంటలకు ఓటు వేయగా.. 288 వ్యతిరేకంగా ఓటు వేశారు. ఆయన బోర్డులో ముస్లిమేతర సభ్యులు ఉండకూడదంటూ సవరణ ప్రతిపాదించారు. ఈ బిల్లుపై లోక్సభలో దాదాపు 12 గంటలకుపై చర్చ జరిగింది.
ఇక ఈ బిల్లు రాజ్యసభలో గురువారం ప్రవేశపెట్టనున్నారు. లోక్సభలో బుధవారం మధ్యాహ్నం బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రమంత్రి కిరణ్ రిజిజు చర్చను ప్రారంభించారు. బిల్లు ఉద్దేశం ఏ మతంలో జోక్యం చేసుకోవడం కాదని.. వక్ఫ్ ఆస్తులను నిర్వహించడం మాత్రమేనన్నారు. పాత చట్టంలోని వివాదాస్పదమైన సెక్షన్ 40ని ప్రస్తావించారు. దాని ద్వారా వక్ఫ్ బోర్డు ఏదైనా భూమిని వక్ఫ్ ఆస్తికగా ప్రకటించవచ్చన్నారు. ట్రిబ్యునల్ మాత్రమే దాన్ని రద్దు చేయగలదని.. లేదంటే సవరించగలదన్నారు. ముస్లిం సమాజానికి చెందిన ఏ భూమినీ ఎవరూ తీసుకోరని.. ప్రతిపక్షం తప్పుదారి పట్టిస్తోందని మండిపడ్డారు. అంతకుముందు, హోంమంత్రి అమిత్ షా బిల్లుపై మాట్లాడుతూ ప్రతిపక్షం వక్ఫ్ బోర్డుకు ప్రభుత్వ ఆస్తులను దోచుకోవడానికి లైసెన్స్ ఇచ్చిందని ఆరోపించారు.
సొంత భారతదేశంలో మొఘల్ యుగం వ్యవస్థ, చట్టానికి తాము స్థానం ఇవ్వబోమన్నారు. 2013లో యూపీఏ-2 ప్రభుత్వం చేసిన సవరణను షా గుర్తు చేశారు. ఆ సవరణ విస్తృతమైన అరాచకానికి దారి తీసిందని.. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఈ సవరణను అన్యాయమని పిలిచి కఠినమైన చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారన్నారు. ప్రభుత్వం లాలూ యాదవ్ కోరికను నెరవేరుస్తోందన్నారు. చర్చలో ఓ ప్రశ్నకు కిరణ్ రిజిజు సమాధానం ఇస్తూ.. 1954 నుంచి వక్ఫ్ చట్టం అమలులో ఉన్నప్పుడు, బిల్లు రాజ్యాంగ విరుద్ధమని ప్రతిపక్షాలు చేస్తున్న వాదనలు, దాంట్లో సవరణ ఎలా రాజ్యాంగ విరుద్ధం అవుతుందని ప్రశ్నించారు. ముస్లింలకు భారత్ మాత్రమే సురక్షితమైందన్నారు. వక్ఫ్లో ప్రభుత్వం జోక్యం ఉండదని స్పష్టం చేశారు.