Kolkata : రెస్టారెంట్లో మటన్ అడిగితే బీఫ్ వడ్డించాడు ఒక వెయిటర్. అది కూడా ఒక యూట్యూబర్‌కు. దీంతో అతడు ఫిర్యాదు చేయడంతో ఇప్పుడు వెయిటర్ అరెస్టయ్యాడు. తను పొరపాటున వడ్డించాడో.. లేక ఆ రెస్టారెంట్లో సహజంగా ఇలా కావాలని వడ్డిస్తారో తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయంలో చాలామంది రెస్టారెంట్ యాజమాన్యాన్ని తప్పుబడుతున్నారు. రెస్టారెంట్లలో సిబ్బంది తాము కస్టమర్లకు అందించే ఫుడ్ విషయంలో అలర్ట్‌గా ఉండాలి. లేకుంటే ఇలాగే అరెస్టవ్వాల్సి వస్తుంది.
కోల్‌కతాలో ఓలిపబ్ అనే ఒక ఫేమస్ పబ్ కం రెస్టారెంట్ ఉంది. పార్క్ స్ట్రీట్‌లో ఉండే ఈ రెస్టారెంట్ నైట్ లైఫ్, పబ్ లైఫ్‌కు అక్కడ బాగా ఫేమస్. అయితే, ఇప్పుడు మటన్ అడిగిన కస్టమర్లకు బీఫ్ వడ్డించి వివాదంలో నిలిచింది. శుక్రవారం రాత్రి సయాక్ చక్రవర్తి అనే యూట్యూబర్ తన స్నేహితుడితో కలిసి ఓలి పబ్‌కు వెళ్లాడు. అక్కడ వెయిటర్‌కు మటన్ కావాలని అడిగాడు. కొద్దిసేపటి తర్వాత అతడి టేబుల్ మీదకు ఫుడ్ తీసుకువచ్చాడు వెయిటర్. అది చూడగానే అతడికి అది మటన్ కాదనే అనుమానం వచ్చింది. ఈ విషయంపై వెయిటర్‌ను అడిగితే అది మటనే అని చెప్పాడు. దీంతో సయాక్, అతడి స్నేహితుడు కలిసి అది తిన్నాడు. కానీ, కొద్దిసేపటి తర్వాత మరో వెయిటర్ ఆ టేబుల్ మీదకు ఇంకో ఫుడ్ తీసుకొచ్చాడు. అది మటన్ అని చెప్పాడు. అంటే వారు ఆర్డర్ ఇచ్చింది ఒకటే మటన్. కానీ, రెండు వచ్చాయి. పైగా ఆ రెండూ వేర్వేరు.
అంటే మొదట వచ్చింది బీఫ్. రెండోది మటన్. దీంతో తాము తిన్నది మటన్ కాదు.. బీఫ్ అని సయాక్కు అర్థమైంది. దీంతో ఆవేశపడిన సయాక్.. వెయిటర్‌ను పిలిచి ఇదే విషయంపై అడగగా.. ఏదో పొరపాటున జరిగిందని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. తాము మత విశ్వాసాల ప్రకారం బీఫ్ తినమని తెలిసినా ఎందుకు వడ్డించారని ప్రశ్నించాడు. అయినా సరైన సమాధానం రాలేదు. దీంతో వెంటనే సయాక్.. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. బీఫ్ వడ్డించిన వెయిటర్‌ను అరెస్టు చేశారు. ఘటనపై రెస్టారెంట్ సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. కావాలని వడ్డించారా.. లేక నిజంగానే పొరపాటు జరిగిందా.. ఇలా ఇతరులకు కూడా మటన్ బదులు బీఫ్ వడ్డిస్తారా వంటి అంశాలపై ఆరా తీస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాన్ని సయాక్ వీడియో తీశాడు.
తను యూట్యూబర్ కావడంతో వీడియోలో బంధించి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఇది వైరల్‌గా మారింది. చాలా మంది రెస్టారెంట్ సిబ్బంది నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు. కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అయితే, వీడియో పోస్ట్ చేసిన తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ.. ఆ వీడియోను సయాక్ డిలీట్ చేశాడు. కానీ, అప్పటికే ఆ వీడియోను చాలామంది డౌన్లోడ్ చేసుకుని వైరల్ చేస్తున్నారు.