Harivansh | రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ మంగళవారం రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. సోమవారం సాయంత్రం జగదీప్ ధన్ఖర్ ఉప రాష్ట్రపతిగా రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన రాష్ట్రపతిని కలువడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రపతి భవన్ ‘ఎక్స్’ పోస్ట్‌లో భేటీకి సంబంధించిన చిత్రాన్ని షేర్ చేసింది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలిపింది. జగదీప్ ధన్ఖర్ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలిరోజే పదవికి రాజీనామా చేసి అందరికీ షాక్ ఇచ్చారు.
మంగళవారం రాజ్యసభలో ఉదయం హరివంశ్ సభకు అధ్యక్షత వహించారు. అయితే, విపక్షాల ఆందోళనలతో ప్రారంభమైన కొద్దిసేపటికే రాజ్యసభ కార్యకలాపాలు బుధవారానికి వాయిదాపడ్డాయి. ఉపరాష్ట్రపతి రాజీనామా కారణంగా రాజ్యసభ చైర్మన్ పదవి సైతం ఆటోమేటిక్‌గా ఖాళీ అయ్యింది. ఉపరాష్ట్రపతి ఎగువ సభకు ఎక్స్-అఫిషియో చైర్మన్. ఈ పరిస్థితుల్లో ఆయన రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం తెలుపడంతో వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభ కార్యకలాపాలు మొత్తం డిప్యూటీ చైర్మన్ హరివంశ్ చూసుకోనున్నారు.
పార్లమెంట్ సమావేశాల తొలిరోజున జగదీప్ ధన్ఖర్ చురుగ్గానే కనిపించారు. ఉదయం సభలో సానుకూలంగా చర్చలు జరపాలని ఆయన సభ్యులకు సూచించారు. జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసన తీర్మాన నోటీసును అంగీకరించిన ఆయన.. ప్రక్రియను వివరించారు. జస్టిస్ శేఖర్ యాదవ్‌పై సమర్పించిన అభిశంసన నోటీసులో ఒక ఎంపీ డబుల్ సంతకంపై విచారణను చేయనున్నట్లు తెలిపారు. అయితే, ఆరోగ్య కారణాలు పేర్కొంటు ఆయన తక్షణం అమలులోకి వచ్చేలా ఆయన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపిన రాజీనామా లేఖలో వైద్యుల సూచన మేరకు ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యం ఇచ్చేందుకు రాజీనామా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
ఆయన మార్చిలో ఎయిమ్స్‌లో చేరారు. ఆ తర్వాత వైద్యులు ఆయనను ఢిల్లీ వెలుపలకు వెళ్లకుండా ఉండాలని సూచించారు. జూన్‌లో ఉత్తరాఖండ్‌లోని కుమావున్ విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన వేదికపైనే స్పృహ కోల్పోయారు. ఆ రోజు వేడి పరిస్థితులు ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. ఈ నెల ప్రారంభంలో ఆయన కేరళలో పర్యటించారు. ఈ సమయంలో ఆరోగ్యం క్షీణించగా.. భార్య ఆయనకు అండగా ఉన్నారు. జులై 17న ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో స్వల్పంగా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన భార్య మంచినీళ్లు తీసుకువచ్చి ఇవ్వగా పరిస్థితి మెరుగైంది. ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వైద్యుల సూచనల మేరకు కీలక బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు తెలుస్తున్నది.