Jagdeep Dhankhar | న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: న్యాయ వ్యవస్థ తన పరిధులు దాటి జవాబుదారీతనం లేని సూపర్ పార్లమెంట్‌గా పనిచేస్తోందని ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖఢ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను నిర్ణీత గడువులోగా ఆమోదించాలంటూ రాష్ట్రపతి, గవర్నర్లకు సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో ఉప రాష్ట్రపతి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. గురువారం నాడిక్కడ రాజ్యసభ ఇంటర్నీల బ్యాచ్‌ను ఉద్దేశించి ధన్‌ఖఢ్ ప్రసంగిస్తూ, రాజ్యాంగపరంగా అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని ప్రమాణం చేస్తారని, కాని ఇప్పుడు ఓ తాజా తీర్పులో రాష్ట్రపతికే ఆదేశాలు వచ్చాయని అన్నారు.
‘ఎక్కడకు వెళుతున్నాం మనం? ఏం జరుగుతోంది ఈ దేశంలో?’ అని ఆయన ప్రశ్నించారు. తమిళనాడు బిల్లుల కేసులో మార్చిలో తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు 10 బిల్లులకు ఆమోదం తెలియచేయకుండా గవర్నర్ ఆర్ఎన్ రవి పెండింగ్‌లో ఉంచడాన్ని ఏకపక్ష, చట్ట వ్యతిరేక చర్యగా అభివర్ణించడాన్ని ప్రస్తావిస్తూ న్యాయవ్యవస్థ పరిధిని ధన్‌ఖఢ్ ప్రశ్నించారు. రెండవసారి అసెంబ్లీ ఆమోదం పొందిన బిల్లులకు మూడు నెలల్లోగా గవర్నర్ ఆమోదం తెలియచేయాలని ఆదేశించడంతోపాటు 201 అధికరణ కింద రాష్ట్రపతి విధులు కూడా న్యాయ సమీక్షకు లోబడి ఉంటాయన్న సుప్రీంకోర్టు తీర్పుపై ధన్‌ఖఢ్ ఘాటుగా స్పందించారు.
‘నిర్ణీత గడువులోగా రాష్ట్రపతి నిర్ణయం తీసుకోకపోతే సంబంధిత బిల్లులు చట్టాలు అయిపోతాయని అంటున్నారు. ఇప్పుడు మనకు చట్టాలు చేసి కార్యనిర్వాహక బాధ్యతలు కూడా నిర్వర్తించి, సూపర్ పార్లమెంట్‌గా పనిచేసే న్యాయమూర్తులు వచ్చారు. వారికి మాత్రం ఎటువంటి జవాబుదారీతనం ఉండదు’ అంటూ సుప్రీంకోర్టు మాజీ న్యాయవాది కూడా అయిన ధన్‌ఖడ్ వ్యాఖ్యానించారు. రాజ్యాంగంలోని 142 అధికరణ కింద న్యాయ వ్యవస్థకు కల్పించిన అపరిమిత అధికారాలపై కూడా ధన్‌ఖఢ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రజాస్వామిక శక్తుల పాలిట 142 అధికరణ అణ్వస్త్రంగా మారిందంటూ వ్యాఖ్యానించారు.
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో భారీ స్థాయిలో నోట్ల కట్టలు కనిపించినట్టు వచ్చిన ఆరోపణలపై న్యాయ వ్యవస్థ స్పందన పట్ల ధన్‌ఖఢ్ ఆందోళన వ్యక్తం చేశారు. మార్చి 14-15 తేదీ రాత్రి ఘటన జరిగితే మార్చి 21న కానీ పత్రికల్లో వార్త రాలేదని చెప్పారు. ఇదే ఘటన ఓ సామాన్య వ్యక్తి ఇంట్లో జరిగి ఉంటే స్పందన వేగంగా మరో మాటలో చెప్పాలంటే ఎలక్ట్రానిక్ రాకెట్ స్పీడులో ఉండేదని ఆయన వ్యాఖ్యానించారు. కాని ఇప్పుడు ఎడ్ల బండి అంత వేగం కూడా లేదంటూ ఎద్దేవా చేశారు. న్యాయమూర్తిపై ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదని గుర్తు చేశారు. భారతీయ చట్టాల ప్రకారం తనతోసహా రాజ్యాంగపరమైన పదవిలో ఉన్న ఏ వ్యక్తిపైనైనా ఎటువంటి ప్రత్యేక అనుమతి లేకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయవచ్చని ఆయన అన్నారు. అదే న్యాయమూర్తుల విషయానికి వచ్చేసరికి ఎఫ్ఐఆర్ల నమోదుకు న్యాయవ్యవస్థ నుంచి అనుమతి అవసరమని, ఇది రాజ్యాంగం కల్పించిన అధికారం కాదని ఉప రాష్ట్రపతి స్పష్టం చేశారు.
జడ్జి ఇంట్లో కరెన్సీ కట్టలు కనిపించిన ఘటన దర్యాప్తు కోసం ముగ్గురు న్యాయమూర్తుల కమిటీని ఏర్పాటు చేయడాన్ని ధన్‌ఖఢ్ విమర్శించారు. ఆ కమిటీకి పార్లమెంట్ నుంచి చట్టపరమైన ఆమోదం లేదని, దానికి ఎటువంటి అధికారాలు లేవని అన్నారు. ‘ఆ కమిటీ సిఫార్సులు మాత్రమే చేయగలదు.. కాని ఎవరికి… ఎందుకోసం.. హైకోర్టు న్యాయమూర్తిపై తుది చర్యలు తీసుకునేది పార్లమెంటరీ ప్రక్రియ ద్వారా మాత్రమే’ అని ఆయన స్పష్టం చేశారు. నెల రోజులు గడచిపోయాయని, దర్యాప్తు వేగంగా జరిగి సాక్ష్యాలను భద్రపరచాల్సిన అవసరం ఉందని చెప్పారు. మనమే చట్టాలను నీరుగార్చడం లేదా? అని కూడా ఆయన న్యాయవ్యవస్థను నిలదీశారు. న్యాయవ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం రావాలని పిలుపునిస్తూ అది పురుగుల డబ్బా అయినా, అటకలో అస్తిపంజరాలు ఉన్నా మూత తీయాల్సిన సమయం ఆసన్నమైందని, ప్రక్షాళన ప్రారంభించక తప్పదని ధన్‌ఖఢ్ వ్యాఖ్యానించారు.