పాట్నా: బీహార్ శాసనసభ ఎన్నికల (Bihar Assembly Elections) ఆఖరి విడత పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఈ విడతలో 20 జిల్లాల పరిధిలోని 122 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. మొత్తం 3.70 కోట్ల మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. వీరికోసం 45 వేలకుపైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1302 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో సీఎం నితీశ్ కుమార్ మంత్రివర్గంలోని 12 మంది మంత్రులు కూడా పోటీలో ఉన్నారు.
ఎన్డీయే కూటమిలోని చిన్న పార్టీ అయిన హిందూస్థానీ అవామీ పోటీ చేస్తున్న 6 స్థానాలు ఈ ఆఖరి విడతలోనే ఉన్నాయి. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేశ్ కుమార్, కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత షకీల్ అహ్మద్ ఖాన్, సీపీఐ(ఎంఎల్) శాసన సభా పక్ష నేత మెహబూబ్ అలమ్ పోటీ చేసే స్థానాలకు ఈ విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 14 అన్ని నియోజక వర్గాల ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నెల 6న బీహార్లో 121 స్థానాలకు పోలింగ్ పూర్తయిన విషయం తెలిసిందే.