న్యూఢిల్లీ, జూన్ 29 : పశ్చిమ బెంగాల్లో వివాదాస్పద ఓటర్ల జాబితా సవరణ(సర్) సందర్భంగా తన పేరును ఓటర్ల జాబితా నుండి తొలగించడంతో తన పాస్‌పోర్ట్ పునరుద్ధరణ(రెన్యువల్) నిలిచిపోయిందని ది టెలిగ్రాఫ్ వార్తాపత్రిక మాజీ ఎడిటర్ ఆర్ రాజగోపాల్ తెలిపారు. కోల్‌కతాలోని బల్లిగంజ్ నియోజకవర్గంలో 25 ఏండ్లకు పైగా నివసిస్తున్నప్పటికీ 2002 నాటి ఓటర్ల జాబితాలో తన పేరు గానీ, తన తండ్రి పేరు గానీ కనిపించకపోవడంతో తన పేరును తొలగించారని ది వైర్ వార్తా వెబ్సైట్లో ప్రచురితమైన ఒక వ్యాసంలో రాజగోపాల్ పేర్కొన్నారు. 2010 నుండి ఓటరుగా ఉంటూ కోల్‌కతాకు చెందిన ది టెలిగ్రాఫ్ పత్రికకు ఏడేండ్లపాటు సంపాదకుడిగా వ్యవహరించినప్పటికీ తన పేరును తొలగించారని ఆయన తెలిపారు. నేను నా మెట్రిక్యులేషన్ సర్టిఫికెట్‌ను సమర్పించినప్పటికీ ఓటర్ల జాబితా నుండి నన్ను తొలగించడానికి ఎటువంటి కారణం చూపలేదు.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ట్రిబ్యునళ్లలో ఒకదాని వద్ద నా అప్పీల్ ప్రస్తుతం పెండింగ్‌లో ఉంది అని ఆయన పేర్కొన్నారు. ఓటర్ల జాబితా నుండి తన పేరు తొలగించడం వల్ల పాస్‌పోర్ట్ పునరుద్ధరణకు సంబంధించిన పోలీసు ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయలేకపోయామని అధికారులు ఆ తర్వాత తనకు చెప్పారని ఆయన తెలిపారు. పాస్‌పోర్ట్ రెన్యువల్‌కు ఓటరు గుర్తింపు కార్డును తప్పనిసరి పత్రంగా పేర్కొనే ఎటువంటి బహిరంగ పత్రం కనిపించకపోవడంతో తాను అయోమయానికి గురయ్యానని రాజగోపాల్ పేర్కొన్నారు. పాత్రికేయ వృత్తిలో ఉండి ఒక ప్రముఖ వార్తాపత్రికకు సంపాదకుడిగా వ్యవహరించిన వారికే ఇటువంటి ఇబ్బందులు ఎదురైతే ఇక అట్టడుగు వర్గాల వారు ఎలాంటి పరిస్థితులను అనుభవించాల్సి వస్తుందో ఊహించుకోవచ్చు అని ఆయన తెలిపారు. సర్ ప్రక్రియలో ఓటు హక్కు కోల్పోయి కోర్టులో అప్పీల్ చేసిన వేలాదిమందిలో రాజగోపాల్ కూడా ఒకరు.
రాజగోపాల్ కేసు సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది. పాత్రికేయులు, ప్రతిపక్ష నాయకులు ఆయనకు మద్దతు తెలుపుతూ ఓటు హక్కును పునరుద్ధరించాలని ఈసీని కోరారు. తాను రాజగోపాల్‌కు మద్దతుగా నిలుస్తున్నట్లు సీనియర్ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. భయానక విషయం ఏమిటంటే ఇది ఎవరికైనా జరగవచ్చు అని ఆయన పేర్కొన్నారు. తన జర్నలిజానికి, జవాబుదారీతనాన్ని డిమాండ్ చేసినందుకు రాజగోపాల్ మూల్యం చెల్లిస్తున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా ఎనాథ్ ఆరోపించారు. సర్ ప్రక్రియ దేశంలోని పేద, బలహీన వర్గాలను ఓటు హక్కుకు దూరం చేస్తుందని తమ పార్టీ ముందే హెచ్చరించిందని సీపీఎం ప్రధాన కార్యదర్శి బేబీ పేర్కొన్నారు. ఇప్పుడు రాజగోపాల్ వంటి ప్రఖ్యాత పాత్రికేయుడికి కూడా ఓటు హక్కు తిరస్కరణకు గురయ్యిందని ఆయన తెలిపారు.
టెలిగ్రాఫ్ వార్తాపత్రిక మాజీ ఎడిటర్ ఆర్ రాజగోపాల్ పట్ల ఎన్నికల కమిషన్ ప్రవర్తించిన తీరును ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఖండించింది. సర్ ప్రక్రియ కారణంగా లక్షలాది మంది భారతీయులు అనుభవిస్తున్న దుస్థితిని రాజగోపాల్ ఉదంతం ప్రతిబింబిస్తున్నదని గిల్డ్ ఒక ప్రకటనలో పేర్కొన్నది. రాజగోపాల్ వంటి పలుకుబడిగల ప్రముఖ వ్యక్తి ఓటే తొలగించగలిగితే సామాన్య భారతీయుల పరిస్థితి ఇంకా దారుణంగా ఉండే అవకాశం ఉందని గిల్డ్ తెలిపింది. ఎన్నికల కమిషన్ వివేకం, సానుభూతితో వ్యవహరించి రాజగోపాల్ ఓటరు గుర్తింపును వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని గిల్డ్ కోరింది. అలాగే అటువంటి పరిస్థితినే ఎదుర్కొంటున్న వారందరి పట్ల సానుకూల దృక్పథాన్ని ప్రదర్శించాలని కూడా ఈసీని కోరింది.