పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly Elections) ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ ఓట్లను లెక్కిస్తున్నారు. అనంతరం ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్ల లెక్కింపు చేపడతారు. మధ్యాహ్నం వరకు ఫలితాలపై (Bihar Results) ఒక స్పష్టత రానున్నది. ఉదయం 9 గంటల నుంచే ట్రెండ్స్ వెలువడనున్నాయి. బీహార్ అసెంబ్లీలోని మొత్తం 243 స్థానాలకు ఈనెల 6, 11న రెండు విడతల్లో ఎన్నికలు జరిగాయి. రికార్డుస్థాయిలో 67.13 శాతం పోలింగ్ నమోదయింది. రాష్ట్రంలో 1951 తర్వాత ఈసారే అత్యధిక పోలింగ్ రికార్డయింది. 2020తో పోలిస్తే ఈసారి 9.84 శాతం అధికం. కాగా, ఓట్ల లెక్కింపునకు 38 జిల్లాల్లో 46 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ఫిగర్ 122 సీట్లు. ప్రధానంగా అధికార ఎన్డీయే, విపక్ష మహాగఠ్‌బంధన్ మధ్య పోటీ నెలకొన్నది. ఎన్డీఏ కూటమిలో బీజేపీ, జేడీయూ, ఎల్జేపీ(రామ్‌విలాస్), హెచ్ఏఎం, రాష్ట్రీయ లోక్‌మోర్చా పార్టీలు ఉండగా, మహాగఠ్‌బంధన్‌లో ఆర్జేడీ, కాంగ్రెస్, సీపీఐఎంఎల్, వీఐపీ, సీపీఐ, సీపీఎం, ఐఐపీ, జనశక్తి జనతాదళ్ ఉన్నాయి. ఇక ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన్‌సురాజ్ పార్టీ 238 స్థానాల్లో పోటీ చేసింది. అయితే ఈ ఎన్నికల్లో ప్రశాంత్ పార్టీ ప్రభావం అంతంత మాత్రమేనని తెలుస్తున్నది.
జేడీయూ అధినేత, రాష్ట్రంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న నితీశ్‌కుమార్‌కు (Nitish Kumar) ఐదో పర్యాయం పీఠం దక్కుతుందా లేక బీహార్ ప్రజలు మార్పు కోరుకుంటే మహాఘట్బంధన్కు అధికారం దక్కుతుందా అన్న విషయం మరి కొన్ని గంటల్లోనే తేలిపోనున్నది. అయితే బీహార్ పీఠం మళ్లీ ఎన్డీయేదే అని మెజార్జీ ఎగ్జిపోల్స్ అంచనా వేసిన విషయం తెలిసిందే.
2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి 125 సీట్లు దక్కాయి. ఇందులో బీజేపీ 74 చోట్ల విజయం సాధించగా, జేడీయూ 43, వీఐపీ 4, హెచ్ఏఎం 4 చొప్పున గెలుపొందాయి. ఇక మహాగఠ్‌బంధన్ 110 స్థానాల్లో విజయం సాధించింది. ఇందులో ఆర్జేడీ 75, కాంగ్రెస్ 19, సీపీఐ ఎంఎల్ 12, సీపీఐ 2, సీపీఎం 2 చోట్ల గెలుపొందాయి. ఇతరలు 8 స్థానాలు దక్కించుకున్నారు.