న్యూఢిల్లీ, డిసెంబర్ 4: రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తుండటంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న విమర్శలను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తిప్పికొట్టారు. అమెరికా ద్వంద్వ నీతిని ఎండగట్టారు. తమ అణు రియాక్టర్ల కోసం రష్యా నుంచి అమెరికా యురేనియం కొనుగోలు చేస్తున్నదని పేర్కొన్న ఆయన.. భారత్ ఆయిల్ కొనుగోలు చేస్తుంటే మాత్రం అమెరికా ఆంక్షలు విధిస్తున్నదని తప్పుబట్టారు. రెండు రోజుల పర్యటన కోసం గురువారం భారత్‌కు వచ్చిన ఆయన ఇండియా టుడేకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. రష్యా నుంచి కొనుగోలు చేసే హక్కు అమెరికాకు ఉన్నప్పుడు భారత్ కూడా అదే హక్కు ఉంటుంది కదా అని అన్నారు. ఈ అంశంపై ట్రంప్‌తో చర్చించనున్నట్టు తెలిపారు. అమెరికాకు మా నుంచి ఇంధనం కొనుగోలు చేసే హక్కు ఉన్నప్పుడు భారత్ హక్కును ఎందుకు హరించాలని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం భారత్‌తో ఉన్న ఇంధన సహకారంలో ఎలాంటి మార్పు లేదని ఆయన తెలిపారు.
భారత్-రష్యా మధ్య సహకారం, మైత్రి ఏ దేశానికీ వ్యతిరేకం కాదని పుతిన్ స్పష్టం చేశారు. తమ దేశాల ప్రయోజనాల పరిరక్షణ మాత్రమే ఏకైక లక్ష్యమని వివరించారు. రష్యాతో భారత ఇంధన సంబంధాల గురించి మాట్లాడుతూ, రష్యాతో భారత దేశ సన్నిహిత సంబంధాలను దృష్టిలో పెట్టుకుని, అంతర్జాతీయ మార్కెట్లలో భారత్ పాత్ర పెరుగుతుండటం కొన్ని శక్తులకు ఇష్టం లేదని చెప్పారు. అందుకే ఆ శక్తులు కృత్రిమ అడ్డంకులు సృష్టిస్తూ, రాజకీయ కారణాలతో భారత దేశ పలుకుబడిని కట్టడి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయని చెప్పారు. రష్యాపై పాశ్చాత్య దేశాల ఆంక్షలను ప్రస్తావిస్తూ, భారత దేశానికి తన దేశ ఇంధన సహకారం అత్యధికంగా ఎటువంటి ప్రభావం లేకుండా కొనసాగుతుందని తెలిపారు. బయటి శక్తుల నుంచి తాము ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ, తాను కానీ, పీఎం మోదీ కానీ వేరొకరికి వ్యతిరేకంగా పని చేయడానికి తమ మధ్య సహకారాన్ని ఎన్నడూ ఉపయోగించుకోలేదన్నారు.
రక్షణ కోసం సొంతంగా నిర్ణయాలు తీసుకునే హక్కు, అధికారం ఉక్రెయిన్‌కు ఉన్నాయని పుతిన్ పునరుద్ఘాటించారు. అయితే, రష్యా భద్రతకు ముప్పు కలిగించే విధంగా ఆ నిర్ణయాలు ఉండకూడదని తెలిపారు. రష్యన్ భాష, సంస్కృతి, రష్యన్ మతం, భౌగోళిక సమస్యలు… ఇవన్నీ చాలా ముఖ్యమైన విషయాలని చెప్పారు. నాటో పూర్తిగా భిన్నమైన అంశమని తెలిపారు. తమకు ప్రత్యేకంగా కావాలని దేనినీ డిమాండ్ చేయడం లేదన్నారు. మరో దేశాన్ని పణంగా పెట్టడం వల్ల ఓ దేశానికి భద్రత రాదని అంతర్జాతీయ భద్రతా నిబంధనలు, సూత్రాలు చెప్తున్నాయని తెలిపారు. సార్వభౌమాధికారం గల ఏ దేశానికైనా తనను తాను కాపాడుకునే హక్కు ఉంటుందని, అదే విధంగా ఆ హక్కు ఉక్రెయిన్‌కు కూడా ఉందని చెప్పారు. ఆ హక్కును ఉక్రెయిన్‌కు తాము తిరస్కరించామా? అని ప్రశ్నించారు. ‘లేదు’ అని ఆయన సమాధానం చెప్పి, రష్యాను పణంగా పెట్టి ఆ పని చేయడం మాత్రం ఆమోదయోగ్యం కాదని తెలిపారు. ‘నాటోలో చేరడం వల్ల తనకు లబ్ధి చేకూరుతుందని ఉక్రెయిన్ నమ్ముతున్నది. అది తమ భద్రతకు ముప్పు అని మేం చెప్తున్నాం. మాకు ముప్పు లేకుండా, మిమ్మల్ని కాపాడుకోగలిగే మార్గాన్ని మనం అన్వేషిద్దాం’ అని అన్నారు.
రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం గురువారం సాయంత్రం భారత్ చేరుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ సాదర స్వాగతం పలికారు. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత మొదటిసారి దాదాపు 27 గంటల సందర్శన నిమిత్తం పుతిన్ న్యూఢిల్లీ చేరుకున్నారు. కళాకారుల బృందాల సంప్రదాయ నృత్యాల నడుమ పాలం విమానాశ్రయం వద్ద పుతిన్‌కి రెడ్‌కార్పెట్ స్వాగతం పలికిన మోదీ ఆయనతో కరచాలనం చేసి ఆలింగనం చేసుకున్నారు. ఇద్దరు నాయకులు ప్రధాని అధికారిక నివాసానికి మోదీ కారులో బయల్దేరి వెళ్లారు. భారత్‌ను సందర్శించిన తన మిత్రుడు, అధ్యక్షుడు పుతిన్‌కు భారత్‌లో స్వాగతం పలుకుతున్నట్లు మోదీ తన సోషల్ మీడియా అకౌంట్లో పేర్కొన్నారు. నేడు, రేపు తమ మధ్య జరగనున్న చర్చల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
భారత్-రష్యా మైత్రి దీర్ఘకాలంగా కొనసాగుతోంది, ఇది భారత ప్రజలకు గొప్ప ప్రయోజనాలు చేకూర్చిందని ఆయన తెలిపారు. గత ఏడాది జూలైలో మాస్కోలో తన పర్యటన సందర్భంగా పుతిన్ ఇచ్చిన ఆతిథ్యానికి ప్రతిగా ప్రధాని మోదీ ఆయనకు తన నివాసంలో ప్రైవేట్ విందు ఇచ్చారు. శుక్రవారం జరగనున్న 23వ భారత్-రష్యా శిఖరాగ్ర చర్చలకు అనుకూలమైన వాతావరణాన్ని ఈ విందు సమావేశం ఏర్పర్చగలదని అధికార వర్గాలు ఆశిస్తున్నాయి. భారత్-రష్యా రక్షణ, వాణిజ్య బంధాన్ని మరింత బలోపేతం చేయడం, మాడ్యులర్ రియాక్టర్లో పరస్పర సహకారం వంటి కీలక అంశాలు శుక్రవారం నాటి ద్వైపాక్షిక చర్చల్లో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. భారత్-అమెరికా మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో పుతిన్ భారత పర్యటన అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.
ద్వైపాకిక్షక సమావేశంలో భారత్-రష్యా అనేక ఒప్పందాలను కుదుర్చుకునే అవకాశం ఉంది. శుక్రవారం రాజ్‌ఘాట్‌ను సందర్శించి మహాత్మా గాంధీ స్మారకానికి నివాళులర్పించడానికి ముందు రాష్ట్రపతి భవన్ వద్ద పుతిన్ త్రివిధ దళాల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు. అనంతరం సదస్పుకు వేదికైన హైదరాబాద్ హౌస్‌లో ఇద్దరు నాయకులు, వారి ప్రతినిధులతో కలసి అంశాల వారీగా చర్చలు ప్రారంభిస్తారు. సాయంత్రం భారత్ మండపంలో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, రోస్‌కాంగ్రెస్ సంయుక్తంగా నిర్వహించే వ్యాపార సదస్సులో మోదీ, పుతిన్ పాల్గొంటారు. అనంతరం తన గౌరవార్థం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చే ప్రభుత్వ విందులో కూడా పుతిన్ పాల్గొంటారు. శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో పుతిన్ మాస్కోకు బయల్దేరి వెళ్లే అవకాశం ఉంది.