CM Vishnudeo | రాయ్‌పూర్, డిసెంబర్ 10: ఛత్తీస్‌గఢ్ కొత్త సీఎం ఎవరనే దానిపై వారం రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెరపడింది. రాష్ర్టానికి నూతన సీఎంగా కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ ఆదివాసీ నేత విష్ణుదేవ్ సాయ్‌ని బీజేపీ ఎంపిక చేసింది. రాయ్‌పూర్‌లోని రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆదివారం సమావేశమైన 54 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఆయన్ను పార్టీ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకొన్నారు.
ఈ సమావేశానికి ఢిల్లీ నుంచి పార్టీ పరిశీలకులుగా కేంద్ర మంత్రులు అర్జున్‌ముండా, సర్బానంద సోనోవాల్, బీజేపీ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ కుమార్ గౌతమ్ వచ్చారు. విష్ణుదేవ్ సాయ్ గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సుర్జుగా డివిజన్లోని జాష్పుర్ జిల్లా కుంకురి స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. శాసనసభా పక్ష నేతగా ఎన్నిక కావడంపై విష్ణుదేవ్ ఆనందం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యేల సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ తనపై నమ్మకంతో సీఎంగా అవకాశం ఇచ్చినందుకు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ ఇతర నేతలకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా ఎన్నికల సమయంలో తమ పార్టీ ఇచ్చిన ‘మోదీ గ్యారంటీల’ను అమలు చేసేందుకు ప్రయత్నిస్తానని అన్నారు.
ప్రమాణ స్వీకారం అనంతరం హౌసింగ్ స్కీమ్ కింద అర్హులైన లబ్ధిదారులకు 18 లక్షల ఇండ్లను మంజూరు చేయడమే తమ ప్రభుత్వం మొదటి పని అని చెప్పారు. ఇటీవలి ఎన్నికల్లో 90 స్థానాలకు గానూ బీజేపీ 54 సీట్లలో జయకేతనం ఎగురవేసిన విషయం తెలిసిందే. 2018 ఎన్నికల్లో 68 సీట్లతో అధికారం చేపట్టిన కాంగ్రెస్.. ఈ సారి కేవలం 35 స్థానాలకు పరిమితమైంది.
సుదీర్ఘ చర్చల అనంతరం ప్రకటన
2000లో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎంగా బాధ్యతలు నిర్వహించిన అజిత్ జోగీ(2000-03) తొలి ఆదివాసీ సీఎం కాగా.. ఇప్పుడు సుదీర్ఘకాలం తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరో ఆదివాసీకి అవకాశం లభించింది. సీఎంగా ఓబీసీ లేదా అదివాసీ వర్గానికి చెందిన వారిని నియమించే అంశంపై బీజేపీ గత వారం రోజులుగా సుదీర్ఘ చర్చలు జరిపింది. ఈ క్రమంలో ఓబీసీ వర్గం నుంచి అరుణ్ సావో, ఓపీ చౌదరి వంటి పేర్లు వినిపించగా.. ఆదివాసీ కోటాలో విష్ణుదేవ్, రేణుకా సింగ్, రాంవిచార్ నేతమ్ పేర్లు వినిపించాయి. విష్ణుదేవ్ మాజీ సీఎం రమణ్ సింగ్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్నది. రాష్ట్రంలో ఓబీసీల తర్వాత 32 శాతం ఉన్న ఆదివాసీలే అధిక జనాభా కావడం గమనార్హం. ఈ కారణంగానే రాష్ట్ర కొత్త సీఎంగా బీజేపీ విష్ణుదేవ్వైపు మొగ్గుచూపినట్టు తెలుస్తున్నది.
సర్పంచ్ స్థాయి నుంచి అంచెలంచెలుగా..
విష్ణుదేవ్ రాష్ట్ర బీజేపీలో ప్రముఖ ఆదివాసీ నేతగా ఉన్నారు. ఆదివాసీ కమ్యూనిటీలో ఈయనకు మంచి పేరున్నది. గతంలో మూడు పర్యాయాలు(చివరిసారిగా 2020-2022 వరకు) రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. విష్ణుదేవ్ గ్రామ సర్పంచ్‌గా తన రాజకీయ జీవితం ప్రారంభించారు. ఆ తర్వాత కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారు. 2014లో ప్రధాని మోదీ తొలి క్యాబినెట్లో గనుల శాఖ సహాయ మంత్రిగా సేవలందించారు. 1990లో తొలిసారి అవిభాజ్య మధ్యప్రదేశ్‌లోని తప్కారా స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాయగఢ్ నుంచి వరుసగా నాలుగుసార్లు (1999,2004,09,14) లోక్‌సభ ఎంపీగా ఎన్నికైన విష్ణుదేవ్.. పార్టీలో పలు కీలక పదవులు నిర్వర్తించారు. విష్ణుదేవ్ది రాజకీయ కుటుంబం. ఆయన కుటుంబసభ్యులు పలువురు గతంలో ఎమ్మెల్యేలు, ఎంపీలుగా పనిచేశారు.