నాందేడ్, జూలై 7: సాధారణంగా నాణ్యతతో రోడ్డు వేస్తే కొన్నేండ్ల పాటు పటిష్ఠంగా ఉండాలి. కానీ నాసి రకంగా నిర్మిస్తే అది కొన్ని నెలలకే గుంతలు తేలుతుంది. బీజేపీ పాలిత మహారాష్ట్రలో మరీ విడ్డూరంగా ఓ రోడ్డు నెల రోజులకే ఆమ్లేట్లా పొరలు పొరలుగా ఊడి వస్తున్నది. ఆ రోడ్డు ఎంత నాసిరకంగా ఉందో తెలిపే ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నాందేడ్ జిల్లా బిలోలీ సమీపంలో ఓ వ్యక్తి చేతుతోనే రోడ్డుపై పొరను తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
వివరాల్లోకి వెళ్తే నాసిక్ జిల్లా దుగావ్ నుంచి పుణె జిల్లాలోని దొంగర్గావ్ మధ్య నెల రోజుల క్రితం రూ.100 కోట్ల ఖర్చుతో రోడ్డు నిర్మించారు. కానీ కొన్ని రోజులకే రోడ్డుపై గుంతలు పడి కంకర తేలింది. చాలా తక్కువ మోతాదులో తారు ఉపయోగించడం వల్లే రోడ్డు నాసిరకంగా తయారైందని స్థానికులు చెప్పారు. రోడ్డు వేసిన కాంట్రాక్టర్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటననే 2023లో చోటుచేసుకుంది. జల్నా జిల్లాలో రోడ్డు ఉపరితలంలోని తారును ఒక పొరను కొందరు చేతులతో పైకి ఎత్తిన దృశ్యాలు వైరల్ అయ్యాయి.