Viral news : ఆ జంటకు ఇటీవలే వివాహం జరిగింది. పెళ్లి ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత శోభనానికి ముహూర్తం పెట్టారు. వారి దాంపత్య జీవితంలో కీలక ఘట్టం కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. శోభనం గదిని పూలు, పండ్లతో అలంకరించి వరుడిని లోపలికి పంపారు. ఆ తర్వాత వధువు చేతికి పాల గ్లాసు ఇచ్చి ఆమెను కూడా పంపించారు. శోభనం గదిలో వధువు చేసిన పనికి ముందుగా వరుడు, ఆ తర్వాత అతని కుటుంబం షాకయ్యింది. ఉత్తరప్రదేశ్లోని మహోబా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 11న రాజ్దీప్ రావత్, కుషీ తివారీ అనే యువజంట వివాహం జరిగింది. ఓ పురోహితుడు వీరి సంబంధం కుదిర్చాడు. కుషీ తివారీ తల్లికి ఆరోగ్యం బాగాలేదని, త్వరగా వివాహం జరిపించాలని చెప్పి ఆత్రంగా వివాహం జరిపించారు. ఈ పెళ్లి వధువు తరఫున ఆమె సోదరుడు చోటు తివారీ, సోదరుడి స్నేహితుడు వినయ్ తివారీ మాత్రమే హాజరయ్యారు.
వివాహం అనంతరం శోభనానికి ముహూర్తం పెట్టారు. పాలగ్లాసుతో వధువు శోభనం గదిలోకి వెళ్లింది. ఆ పాలు తాగిన కాసేపటికే వరుడు మత్తులోకి జారుకున్నాడు. ఎందుకంటే ఆ పాలలో వధువు మత్తుమందు కలిపింది. వరుడి మత్తులోకి జారుకోగానే బంగారు, వెండి ఆభరణాలతో ఆమె ఉడాయించింది. తెల్లారి మత్తు వదలగానే మేల్కొన్న వరుడు వధువు పరారైన విషయం గుర్తించి షాకయ్యాడు.
ఈ ఘటనపై వరుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వధువుతోపాటు, ఆమె సోదరుడు చోటు తివారీ, సోదరుడి స్నేహితుడు వినయ్ తివారీ, మరో వ్యక్తి పేర్లను ఫిర్యాదులో చేర్చాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.