భోపాల్: కార్ షోరూమ్ వద్ద ఘర్షణ జరిగింది. దీంతో కొందరు వ్యక్తులు విధ్వంసం సృష్టించారు. (Car Showroom vandalized) మేనేజర్, సిబ్బందిపై దాడి చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేత కుమారుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం రాత్రి బీజేపీ నేత ప్రతాప్ కరోసియా కుమారుడు సౌరభ్ తన అనుచరులతో కలిసి లోక్‌సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్ కుమారుడు మిలింద్ మహాజన్‌కు చెందిన కార్ షోరూమ్ వద్దకు వెళ్లాడు. వాహనానికి సర్వీసింగ్ చేయించాడు.
కాగా, సర్వీస్ బిల్లు చెల్లించకుండా అక్కడి నుంచి వెళ్లేందుకు సౌరభ్ ప్రయత్నించాడు. దీంతో షోరూమ్ సిబ్బంది అతడ్ని అడ్డుకునేందుకు యత్నించారు. ఈ నేపథ్యంలో సౌరభ్, అతడి ఏడుగురు అనుచరులు కలిసి షోరూమ్ మేనేజర్, సిబ్బందిపై దాడి చేశారు. ఆవరణను ధ్వంసం చేయడంతోపాటు అద్దాలు పగులగొట్టారు. నచ్చజెప్పేందుకు ప్రయత్నించిన సుమిత్రా మహాజన్ మనవడు సిద్ధార్థ్ మహాజన్‌పై కూడా వారు దాడి చేశారు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. కారు షోరూమ్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. దాడి, విధ్వంస్వానికి పాల్పడిన బీజేపీ నేత ప్రతాప్ కరోసియా కుమారుడు సౌరభ్, అతడి అనుచరులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా, ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
CCTV Footage: The car showroom of former LS speaker Sumitra Mahajan’s son, Milind Mahajan vandalized#MadhyaPradesh #madhyapradeshnews pic.twitter.com/35jR5sWqyL
— Free Press Madhya Pradesh (@FreePressMP) December 7, 2024