ఇంఫాల్: మణిపూర్లో బుధవారం మరోసారి హింస చెలరేగింది. బిష్ణుపూర్ జిల్లాలోని ఫౌగగ్చావో ఇఖాయ్లో భద్రతా బలగాలు బాష్పవాయు గోళాలు ప్రయోగించడంతో 40 మందికి పైగా ఆందోళనకారులకు గాయాలయ్యాయి. కోఆర్డినేటింగ్ కమిటీ ఆఫ్ మణిపూర్ ఇంటిగ్రిటీ(సీవోసీవోఎంఐ) పిలుపు మేరకు వేలాది మంది ఆందోళనకారులు.. భద్రతా బలగాలు తమ జిల్లా వైపున ఏర్పాటు చేసిన బారికేడ్లను చురాచంద్పూర్ వైపునకు నెట్టేందుకు ర్యాలీగా వెళ్లారు.
ఈ సందర్భంగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు భద్రతా బలగాలు టియర్ గ్యాస్ ప్రయోగించాయి. ఆందోళనకారులను ఫౌగగ్చావో ఇఖాయ్ వద్దకు రానివ్వకుండా క్వక్టా వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. మరోవైపు బిష్ణుపూర్ జిల్లాలోని ఓయినం వద్ద స్థానికులు వందలాదిగా బయటకు వచ్చి రోడ్డును దిగ్భందించారు. ఇంఫాల్ నుంచి ఫౌగగ్చావో ఇఖాయ్ వెళ్తున్న భద్రతా బలగాలను అడ్డుకొన్నారు.
ఎడిటర్స్ గిల్డ్ సభ్యులకు అరెస్టు నుంచి సుప్రీంకోర్టు రక్షణ
మణిపూర్ క్షేత్రస్థాయి పరిస్థితులపై నివేదిక ప్రచురించిన ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా(ఈజీఐ) సభ్యులపై నమోదు చేసిన రెండు కేసులపై సుప్రీంకోర్టు బుధవారం కీలక ఆదేశాలు జారీచేసింది. ఈనెల 11 వరకు వారిని అరెస్టు చేయొద్దని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం మణిపూర్ పోలీసులను ఆదేశించింది. ఎడిటర్స్ గిల్డ్ దాఖలు చేసిన పిటిషన్పై స్పందన తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.