Vinesh Phogat : మాజీ రెజ్లర్, ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న వినేశ్ ఫొగాట్(Vinesh Phogat) తనపై సోషల్ మీడియాలో వస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టింది. హర్యానా ప్రభుత్వం నుంచి ప్రైజ్‌మనీగా రూ.4 కోట్లు తీసుకున్నందుకు తనను అప్రతిష్ట పాలు చేయాలని.. కొందరు ఆన్లైన్లో విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టింది ఎమ్మెల్యే. తాను డబ్బుకు ఆశపడే మనిషిని కాదని ఎక్స్‌లో పెట్టిన పోస్ట్‌లో వెల్లడించింది వినేశ్.
‘ట్వీట్‌కు 2 రూపాయలకు ఆశపడిన కొందరు పనిగట్టుకొని మరీ నన్ను ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియలో నాపై విషం చిమ్ముతున్న వాళ్లకు నేను చెప్పేది ఒక్కటే. నేను ఎవరి వద్ద పైసా ఆశించను. సాఫ్ట్ డ్రింక్స్ నుంచి ఆన్లైన్ గేమింగ్ వంటి ప్రకటనల్లో నటిస్తే భారీగా డబ్బులు ఇస్తామని యాడ్ ఏజెన్సీలు నన్ను సంప్రదించాయి. కానీ, నాకంటూ కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. నేను విలువలకు కట్టుబడిన మనిషిని. డబ్బులు వస్తున్నాయని చెప్పి.. ప్రజలకు, సమాజానికి హాని చేసే పనులు చేయను.
2 रुपये लेकर ट्वीट करने वालों और फ्री का ज्ञान बाँटने वालों… ज़रा ध्यान से सुनो!
तुम्हारी जानकारी के लिए बता दूँ — अब तक करोड़ों के ऑफर ठुकरा चुकी हूँ।
सॉफ्ट ड्रिंक्स से लेकर ऑनलाइन गेमिंग तक,
पर मैंने कभी अपने उसूलों का सौदा नहीं किया।
जो कुछ भी हासिल किया है, मेहनत की…— Vinesh Phogat (@Phogat_Vinesh) April 13, 2025
అంతేకాదు ఇప్పటివరకూ నేను సాధించిన విజయాలు నా కష్టార్జితం. నిజాయతీగా ఉండడంతో పాటు నా ఆత్మీయుల ఆశీర్వాదం వల్లనే ఈ స్థాయికి చేరుకున్నాను. అందుకు నేను చాలా గర్వపడుతా. హార్యానాలోని బీజేపీ ప్రభుత్వం నుంచి నేను ఎలాంటి రివార్డు కోరలేదు. కానీ, ఒలింపిక్స్‌లో రజతం గెలుపొందిన అథ్లెట్లను గౌరవించినట్టే నాకు నగదు బహుమతిగా రూ.4 కోట్లు ఇవ్వాలని సర్కార్ భావించింది. కానీ, ప్రభుత్వం ఇచ్చిన రూ. 4కోట్లతో రాష్ట్రంలో ప్రపంచ స్థాయి స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేస్తాను. అందులో క్రీడలపై ఆసక్తి కలిగిన యువతకు శిక్షణ ఇప్పిస్తాను’ అని వివరించింది వినేశ్.
పారిస్ ఒలింపిక్స్‌లో అదనపు బరువు కారణంగా ఫైనల్ ముందుకు అనర్హతకు గురైంది వినేశ్. 50 కిలోల విభాగంలో పోటీ పడిన తను.. 100 గ్రాములు ఎక్కువ ఉండడంతో విశ్వక్రీడల్లో పతకం చేజార్చుకుంది. ఆ తర్వాత కోర్టును ఆశ్రయించినా సరే నిరాశే మిగిలింది వినేశ్‌కు. దాంతో, రెజ్లింగ్‌కు వీడ్కోలు పలికిన తను.. స్వదేశం వచ్చాక ప్రజాజీవితంలో అడుగుపెట్టింది. రాజకీయ అండతో రెచ్చిపోతున్న రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్(Brij Bhushan)ను పొలిటికల్‌గానే ఎదుర్కోవాలనే ఉద్దేశంతో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది. కాంగ్రెస్ తరఫున జులానా నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన వినేశ్ మొదటి ప్రయత్నంలోనే ఎమ్మెల్యేగా ఎంపికైంది.