Gangadhara | గంగాధర, ఏప్రిల్ 14 : భారతదేశంలోని బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గా భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నిలిచారని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కొనియాడారు. గంగాధర మండలం మధురానగర్ లో సోమవారం నిర్వహించిన జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో సమ సమాజ నిర్మాణానికి అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే స్ఫూర్తి అని గుర్తు చేశారు.
యువత అంబేద్కర్ వంటి మహనీయులను ఆదర్శంగా తీసుకొని సమాజంలో గొప్ప వ్యక్తులుగా ఎదగాలన్నారు. రాజ్యాంగ రచన ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టి, మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పించడం ద్వారా వారి అభ్యున్నతికి కృషిచేసిన గొప్ప మేధావి అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ స్ఫూర్తితో ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, అంబేద్కర్ సంఘం నాయకులు పాల్గొన్నారు.