Wrestlers | భారత స్టార్ రెజ్లర్లు (Wrestlers) వినేశ్ ఫోగట్ (Vinesh Phogat), బజరంగ్ పునియా (Bajrang Punia) కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారంటూ గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. త్వరలో జరగబోయే హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో వీరిద్దరికీ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెజ్లర్లు హస్తం పార్టీలో చేరిక దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇవాళ మధ్యాహ్నం 1:30 గంటలకు కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ సమక్షంలో వీరిద్దరూ కాంగ్రెస్‌లోకి చేరుతున్నట్లు జాతీయ మీడియా వెల్లడించింది.
ఇక ఈ నెల 4వ తేదీన బజరంగ్ పునియా, వినేశ్ ఫోగట్ ఇద్దరూ రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని కలిసిన విషయం తెలిసిందే. ఈ భేటీకి సంబంధించిన ఫొటోను కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. ‘వినేశ్ ఫోగట్, బజరంగ్ పునియా ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ను కలిశారు’ అంటూ ట్వీట్ పెట్టింది.
కాగా, వినేశ్ ఫొగాట్ కాంగ్రెస్‌లోకి చేరే అవకాశాలున్నాయని గత కొంత కాలంగా ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్లుగానే ఇటీవలే ఒలింపిక్స్ ముగించుకొని స్వదేశానికి చేరుకున్న సమయంలో కాంగ్రెస్ ఎంపీ దీపిందర్ హుడా ఆమెకు స్వాగతం పలికారు. దీంతో హస్తం నేతలతో సన్నిహితంగా ఉండటంతో ఆమె చేరిక ఖాయమని వార్తలు కూడా వినిపించాయి. అదే సమయంలో వినేశ్‌ను రాజ్యసభకు పంపాలంటూ కొందరు కాంగ్రెస్ నేతలు కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇవాళ వినేశ్‌తోపాటు బజరంగ్ పునియా సైతం కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలిసింది.
త్వరలో జరగబోయే హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో (Haryana elections) ఈ ఇద్దరు రెజ్లర్లను కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపే అవకాశం కనిపిస్తోంది. గత హర్యానా ఎన్నికల ముందు వినేశ్ సోదరి బబితా బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో దాద్రి స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ఆ స్థానం నుంచే బబితకు కమలం పార్టీ టికెట్ ఇచ్చే అకవాశం కనిపిస్తోంది. దీంతో వినేశ్‌ను దాద్రి నుంచి పోటీకి దింపాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన లేదు. మరోవైపు బజరంగ్ పునియా పోటీ చేసే స్థానంపై కూడా ఎలాంటి స్పష్టతా లేదు.
ఇక వచ్చే నెలలో ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. తొలుత అక్టోబర్ 1న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే, అక్టోబర్ 2న బిష్ణోయ్ సామాజిక వర్గ శతాబ్దాల నాటి పండుగను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల తేదీని అక్టోబర్ 5కు మార్చింది. అక్టోబర్ 8న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
Also Read..
Emergency | ఎమర్జెన్సీ మూవీ రిలీజ్ మరోసారి వాయిదా.. త్వరలో కొత్త తేదీ ప్రకటిస్తామని వెల్లడి
Harish Rao | 9 నెలల కాంగ్రెస్ పాలనలో మహిళలపై 1900 లైంగికదాడులు: హరీశ్ రావు
AP News | అప్పుడు జగన్ తీసుకొచ్చిన వాహనాలే ఇప్పుడు చంద్రబాబుకు దిక్కు అయ్యాయి: వైసీపీ