AP News | గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ తీసుకొచ్చిన ఎండీయూ వాహనాలు ఇప్పుడు వరద బాధితులకు అండగా నిలబడ్డాయి. వరద బాధితులకు ఆహారం, మంచినీరు అందించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పుడు వాటినే వినియోగిస్తున్నారు. ఈ విషయాన్ని వైసీపీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
పౌరసరఫరాల దుకాణాల వద్ద ప్రజలు ఎదురుచూసే పనిలేకుండా ఇంటి దగ్గరే రేషన్ పంపిణీ చేసేందుకు గత వైసీపీ ప్రభుత్వం ఎండీయూ వాహనాలను తీసుకొచ్చింది. ఇంటి వద్దకే రేషన్ బియ్యం పంపిణీకి అప్పట్లో 9260 ఎండీయూ వాహనాలను జగన్ కొనుగోలు చేశారని వైసీపీ తెలిపింది. కానీ జగన్పై కోపంతో అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు ఆ వాహనాల్ని మూలన పడేశారని ఆరోపించింది. కానీ ఇప్పుడు వరద బాధితులను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వానికి ఇవే ఎండీయూ వాహనాలు దిక్కు అయ్యాయని విమర్శించింది. విజయవాడలోని ఇరుకు రోడ్లలో వరద బాధితులకు సహాయం చేయడానికి ప్రత్యామ్నాయం లేకపోవడంతో ఆ ఎండీయూ వాహనాలనే కూటమి ప్రభుత్వం వాడుతున్నారని చెప్పింది.