లక్నో: పలు నేర కేసులున్న రౌడీ షీటర్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే అక్కడకు వెళ్లిన పోలీసులపై గ్రామస్తులు దాడి చేశారు. (Villagers Attacks Cops) ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో ఒక వ్యక్తి గాయపడ్డాడు. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. చిర్చిత గ్రామానికి చెందిన ఫక్రుద్దీన్‌పై బులంద్‌షహర్, కౌశాంబి, ప్రయాగ్‌రాజ్ జిల్లాల్లోని పోలీస్ స్టేషన్లలో 10 కేసులు నమోదయ్యాయి. అతడి అరెస్ట్ కోసం రూ. 20,000 రివార్డ్ కూడా పోలీసులు ప్రకటించారు.
కాగా, నంగ్లా మేవతి గ్రామంలో ఫక్రుద్దీన్ దాక్కున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో సేలంపూర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీసులు ఆదివారం ఆ గ్రామానికి చేరుకున్నారు. ఫక్రుద్దీన్‌ను అరెస్ట్ చేశారు. ఇంతలో గ్రామస్తులు పోలీసులను చుట్టుముట్టారు. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో ఒక వ్యక్తి గాయపడ్డాడు. అనంతరం ఫక్రుద్దీన్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
మరోవైపు గ్రామస్తులు కాల్పులు జరిపినప్పటికీ తాము ఎదురు కాల్పులు జరుపలేదని పోలీస్ అధికారి వెల్లడించారు. అయితే ఎవరి కాల్పుల్లో ఆ వ్యక్తి గాయపడ్డడో అన్నది తెలియదని అన్నారు. గాయపడిన అతడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.