Kamala Harris | చెన్నై: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిని కమలా హారిస్ కోసం తమిళనాడులోని తులసేంద్రపురం గ్రామస్థులు పూజలు చేస్తున్నారు. దేవాలయం వద్ద “కమల ఈ గ్రామానికి చెందిన గొప్ప బిడ్డ” అంటూ పోస్టర్ను ఏర్పాటు చేశారు. ఆమె తాత పీవీ గోపాలన్ ఈ గ్రామంలోనే జన్మించారు. ఆమె తల్లి శ్యామల గోపాలన్ 19 ఏళ్ల వయసులో వైద్య విద్యను అభ్యసించేందుకు అమెరికాకు వెళ్లారు. అక్కడే కమల, ఆమె సోదరి మాయ జన్మించారు. తులసేంద్రపురం గ్రామస్థుడు ఒకరు మాట్లాడుతూ.. కమల హారిస్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం గొప్ప చరిత్ర అని చెప్పారు. ఆమె గెలుపోటములతో తమకు సంబంధం లేదని, ఆమె పోటీ చేయడమే తమకు గర్వకారణమని తెలిపారు.