Vikram 3201 | సెమికాన్ ఇండియా-2025 సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ స్వదేశీ సెమీకండక్టర్ ‘విక్రమ్ 3201’ని పరిచయం చేశారు. భారత్ సెమీకండక్టర్ స్వావలంబన దిశగా దాన్ని చారిత్రాత్మక అడుగుగా అభివర్ణించారు. ఈ ప్రాసెసర్‌ను ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO), చండీగఢ్ ఆధారిత సెమీకండక్టర్ లాబొరేటరీ (SCL) సహకారంతో అభివృద్ధి చేశారు. ఇది 32-బిట్ మైక్రోప్రాసెసర్ కాగా.. ఇది అంతరిక్ష కార్యకలాపాలు, కఠినమైన పరిస్థితుల్లో పనిచేయడానికి ప్రత్యేకంగా రూపొందించారు. -55 డిగ్రీల సెల్సియస్ నుంచి +125 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలను తట్టుకోగల సామర్థ్యం ఉన్నది.
రాకెట్లు, లాంచ్ వెహికల్స్‌లో నావిగేషన్, నియంత్రణ, మిషన్ నిర్వహణ పనులను నిర్వహిస్తుంది. రేడియేషన్, వైబ్రేషన్ వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఇది పని చేస్తూనే ఉండేలా దీన్ని సైనిక గ్రేడ్ ప్రమాణాల ప్రకారం రూపొందించారు. గతంలో ఇస్రో 2009 నుంచి ‘విక్రమ్ 1601’ (16-బిట్ ప్రాసెసర్)ను ఉపయోగిస్తోంది. ఇప్పుడు ‘విక్రమ్ 3201’ 32-బిట్ ఆర్కిటెక్చర్‌ను తీసుకురావడమే కాకుండా 64 బిట్ ఫ్లోటింగ్-పాయింట్ ఆపరేషన్స్ అడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సపోర్ట్, మెరుగైన కమ్యూనికేషన్ కోసం ఆన్-చిప్ 1553B బస్ ఇంటర్ఫేస్ వంటి అనేక ప్రధాన అప్‌గ్రేడ్స్‌ను కలిగి ఉన్నది. ఇది ఎస్సీఎల్ చండీగఢ్ యూనిట్లో 180-నానోమీటర్ CMOS టెక్నాలజీని ఉపయోగించి తయారు చేశారు. విక్రమ్ 3201 ఇప్పటికే PSLV-C60 మిషన్‌లోనూ పరీక్షించారు. ఇది PSLV ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ (POEM-4) మిషన్ మేనేజ్మెంట్ కంప్యూటర్ను విజయవంతంగా నిర్వహించింది. ఈ విజయం తర్వాత ఇస్రో రాబోయే లాంచింగ్ వెహికిల్స్‌లో విస్తృతంగా వినియోగించబోతున్నది.
ఇస్రో ఈ ఏడాది మార్చిలో విక్రమ్ 3201తో పాటు కల్పన 3201 అనే మరో ప్రాసెసర్‌ను కూడా ప్రారంభించింది. ఇది 32-బిట్ SPARC V8 RISC ఆర్కిటెక్చర్‌పై ఆధారపడి పని చేస్తుంది. ఓపెన్-సోర్స్ టూల్చెయిన్కు సపోర్ట్ ఇస్తుంది. ఇస్రో మరో నాలుగు స్వదేశీ ఎలక్ట్రానిక్ డివైజ్‌లను ప్రవేశపెట్టింది. ఇందులో రెండు రీకాన్ఫిగరబుల్ డేటా అక్విజిషన్ సిస్టమ్స్, రిలే డ్రైవర్ IC, మల్టీ-ఛానల్ లో డ్రాప్-అవుట్ రెగ్యులేటర్ IC ఉన్నాయి. ఈ పరికరాలన్నీ భారతదేశం దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గిస్తాయి. విక్రమ్ 3201తో భారతదేశం సెమీకండక్టర్ల రంగంలో స్వయం సమృద్ధిని సాధించింది. ఇది సరఫరా గొలుసు అడ్డంకులు, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. ఇస్రో ఇందుకు పూర్తి సాఫ్ట్వేర్ పర్యావరణ వ్యవస్థను కూడా అభివృద్ధి చేసింది. ఇందులో ADA కంపైలర్లు, అసెంబ్లర్లు, లింకర్లు, సిమ్యులేటర్లు ఉన్నాయి.