PM Modi | తమిళనాడులోని కరూర్‌లో తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత, నటుడు విజయ్ ర్యాలీలో జరిగిన తొక్కిసలాట ఘటన చోటు చేసుకున్నది. ఈ ఘటనలో 31 మంది మృతి చెందినట్లుగా సమాచారం. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తొక్కిసలాట ఘటన తీవ్ర దురదృష్టకరమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సంఘటన తీవ్ర బాధాకరమన్నారు. ప్రియమైన వారిని కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నానన్నారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామన్నారు.
అయితే, కరూర్‌లో విజయ్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి దాదాపు పదివేల మందికి అనుమతి తీసుకున్నారు. అయితే, ఈ ర్యాలీకి ఊహించిన దానికంటే ఎక్కువగా గుమిగూడారు. జనం అదుపు తప్పడంతో తొక్కిసలాట లాంటి పరిస్థితి ఏర్పడిందన్నారు. అనేక మంది స్పృహ కోల్పోయి అంబులెన్స్‌లో ఆసుపత్రులకు తరలించారు. గాయపడిన వారిని పెద్ద సంఖ్యలో కరూర్‌లోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. పరిపాలన వెంటనే అదనపు వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలను నియమించింది. చాలా మంది రోగుల పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని జిల్లా యంత్రాంగం పేర్కొంది. సీఎం స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు.
సాధ్యమైనంత సహాయం అందించేందుకు ఆరోగ్య మంత్రి సుబ్రమణియన్, ఇతర మంత్రులను కరూర్‌కు పంపారు. జిల్లా కలెక్టర్, పోలీసు అధికారులు కూడా సంఘటన స్థలంలో ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అయితే, తొక్కిసలాటతో పరిస్థితి మరింత దిగజారుతున్నట్లు గమనించిన విజయ్ తన ప్రసంగాన్ని నిలిపివేసి వెళ్లిపోయారు. వేదికపై నుండే సహాయం కోసం పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఈ సమయంలో ఆయన స్వయంగా కార్యకర్తలకు వాటర్ బాటిల్స్‌ను అందిస్తూ కనిపించారు. కానీ, ర్యాలీకి ఊహించనంత జనం రావడంతో.. వారిని నియంత్రించేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు.