Karur Stampede | తమిళనాడు కరూర్‌లో టీవీకే చీఫ్, ప్రముఖ నటుడు విజయ్ (Actor Vijay) నిర్వహించిన ప్రచార ర్యాలీలో చోటు చేసుకున్న తొక్కిసలాట (Karur Stampede) ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోగా.. సుమారు 60 మంది గాయపడ్డారు. ఇక ఈ ఘటనపై తమిళనాడు అసెంబ్లీలో బుధవారం చర్చ జరిగింది. ఈ చర్చ సందర్భంగా టీవీకే పార్టీ, విజయ్‌పై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ (CM MK Stalin) తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. విజయ్ ఆలస్యంగా రావడమే ఈ ఘటనకు కారణమని వ్యాఖ్యానించారు. కరూర్ తొక్కిసలాట ఘటనకు విజయ్, టీవీకేనే బాధ్యులని పేర్కొన్నారు.
‘టీవీకే చేసిన షెడ్యూల్ తప్పిదాలే కరూర్ తొక్కిసలాటకు కారణం. విజయ్ మధ్యాహ్నం నాటికి వేదిక వద్దకు చేరుకుంటారని పార్టీ పేర్కొంది. కానీ ఆయన ఏడుగంటలు ఆలస్యంగా వచ్చారు. అప్పటికే అక్కడ జనం పెద్ద ఎత్తున గుమిగూడారు. దీంతో ఆయన ప్రచార వాహనం కూడా ముందుకు వెళ్లలేని పరిస్థితి. ఈ క్రమంలో అక్కడ గందరగోళం నెలకొంది. ఊపిరాడక తొక్కిసలాట చోటు చేసుకుంది. విజయ్ ఆలస్యమే తొక్కిసలాటకు ముఖ్య కారణం. ర్యాలీకి వచ్చిన ప్రజలకు తాగునీరు వంటి కనీస సౌకర్యాలను కల్పించడంలో టీవీకే పార్టీ విఫలమైంది’ అని సీఎం ఆరోపించారు. తొక్కిసలాట అనంతరం క్షతగాత్రులకు సాయం చేసేందుకు ప్రయత్నించిన అంబులెన్స్‌లపై టీవీకే కార్యకర్తలు దాడి చేసినట్లు ఆయన ఆరోపించారు. ఈ దాడిలో అత్యవసర సేవల సిబ్బంది కూడా గాయపడినట్లు చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు సీఎం స్టాలిన్ అసెంబ్లీలో వివరించారు.
Also Read..
Bengaluru | పన్ను కట్టబోమంటూ ప్రజలు వార్నింగ్.. బెంగళూరు రోడ్ల సమస్యపై డీకే శివకుమార్ స్పందన
Massive Traffic Jam | భారీ ట్రాఫిక్ జామ్.. 12 గంటలుగా చిక్కుకుపోయిన 500 మంది విద్యార్థులు