న్యూఢిల్లీ, జనవరి 13: రాజ్యసభలో ఓ ఎంపీ సీటు కింద దొరికిన నోట్ల కట్ట తమదేనంటూ ఎవరూ తన చాంబర్‌కు వచ్చి అడగకపోవడం బాధగా ఉందని రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం నాడిక్కడ ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మన నైతిక ప్రమాణాలకు ఇది సమష్టి సవాల్ అని ఆయన వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ సభ్యుడు అభిషేక్ సింఘ్వీకి కేటాయించిన సీటు కింద రూ.500 నోట్ల కట్ట ఒకటి పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా డిసెంబర్ 6న దొరికింది. ఈ అంశం రాజ్యసభను కుదిపేసింది. అధికార, ప్రతిపక్ష సభ్యులు పరస్పరం ఆరోపణలు చేసుకోగా, దీనిపై దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ సభ్యుడు సింఘ్వీ డిమాండు చేశారు. ఈ ఘటనను తీవ్రమైన విషయంగా అభివర్ణించిన ధన్‌ఖడ్ అవసరార్థం ఎవరైనా కరెన్సీ నోట్లు తీసుకెళ్లడం తప్పేమీ కాదని, కాని అవి తమవేనంటూ ఎవరూ అడగకపోవడం బాధాకరమని అన్నారు.
సభ్యుల నైతిక విలువలకు సంబంధించి ఎథిక్స్ కమిటీ చాలా కాలం లేదని, 1990 దశకం చివరిలో రాజ్యసభలో ఎథిక్స్ కమిటీ ఏర్పడిందని ఆయన చెప్పారు. రాజ్యసభకు సభ్యులుగా వచ్చే వ్యక్తులు వివిధ రంగాలలో నిష్ణాతులు, అనుభవజ్ఞులని, అయితే ఎవరి మార్గదర్శకత్వంలోనే వారు పనిచేయాల్సి వస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. సభలో గందరగోళ వాతావరణాన్ని సృష్టించడం వారిలో కొందరికి ఇష్టం లేనప్పటికీ ఆయా పార్టీల ఆదేశాల మేరకు పని చేయక తప్పడం లేదని ఆయన అన్నారు.