హైదరాబాద్: ఇంకా రెండేండ్ల పదవీ కాలం ఉన్నప్పటీకీ తన పదవికి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామ చేయడంతో ఉపరాష్ట్రపతి ఎన్నికలు (Vice President Elections) అనివార్యమయ్యాయి. దీంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ (BJP), విపక్ష కాంగ్రెస్ (Congress)కూటములు దక్షిణాదికే చెందిన వారిని ఉపరాష్ట్రపతి అభ్యర్థులుగా ప్రకటించాయి. ఆ పదవికి మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. సాయంత్రం 6 గంటలకు లెక్కింపు ప్రారంభమవుతుంది. అనంతరం ఫలితాలను ప్రకటిస్తారు. అయితే ఈ ఎన్నికల్లో గెలుపు ఎవరిది?.. ఏ కూటమికి ఎలక్టోరల్ కాలేజీలో బలం ఉన్నది?.. అసలు మన తెలంగాణ వ్యక్తి విజయం సాధిస్తారా?.. బలాబలాలు ఎలా ఉన్నాయంటే..
ఉపరాష్ట్రతి ఎన్నికలో ఎన్డీయే తరఫున తమిళనాడుకు చెందిన రాధాకృష్ణన్ (CP Radhakrishnan), ఇండీ కూటమి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి (Justice Sudershan Reddy) పోటీచేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలో రాజ్యసభ, లోక్‌సభ సభ్యులతో కూడుకున్న ఎలక్టోరల్ కాలేజీలో ఎంపీలు తమకు నచ్చిన వారికి ఓటు వేసే వెసులుబాటు ఉంటుంది. అయితే వారు తమ పార్టీకే ప్రాధాన్యం ఇస్తారు. రహస్య బ్యాలెట్ పద్ధతిలో జరిగే ఈ ఎన్నికలో పాల్గొనే ఎంపీలకు పార్టీ విప్ వర్తించదు. దీంతో క్రాస్ ఓటింగ్ కూడా జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రెండూ కూటములూ అప్రమత్తమయ్యాయి. ఒక్క ఓటు కూడా కోల్పోకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి.
ఇక ఎలక్టోరల్ కాలేజీ విషయానికి వస్తే.. లోక్‌సభలో 542 మంది సభ్యులు, రాజ్యసభలో 239 మంది సభ్యులు ఉన్నారు. వీరంతా కలిసి మొత్తం 781 మంది ఉన్నారు. ఇందులో ప్రతి సభ్యుడి ఓటు విలువ ఒకటిగానే ఉంటుంది. మెజార్టీ మార్కు 391 కాగా, బీఆర్ఎస్ (4), బీజేడీ (7)లు పోలింగ్‌కు దూరంగా ఉంటామని ప్రకటించాయి. దీంతో 386 ఓట్లు దక్కించుకున్నవారు విజేతగా నిలువనున్నారు.
అధికార ఎన్డీఏ (NDA) కూటమికి ఇప్పటి వరకు 425 సభ్యుల బలముంది. 11 మంది సభ్యులున్న వైసీపీ, స్వతంత్రుల మద్దతుతో మెజార్టీ 439కి పెరిగింది. అటు విపక్షాల ఇండియా కూటమికి (INDIA) 324 మంది బలముంది. కొన్ని పార్టీలు మద్దతు ఇచ్చినా విపక్ష అభ్యర్థి విజయానికి దూరంగానే కనిపిస్తుంది. దీంతో ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ గెలుపు ఖాయమే.!
2022లో జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికలో 725 మంది ఎంపీలు ఓట్లు వేశారు. ఇందులో ఎన్డీఏ అభ్యర్థి జగదీప్ ధన్‌ఖడ్‌కు 528 (74.37 శాతం), కాంగ్రెస్ అభ్యర్థి మార్గరెట్ ఆళ్వాకు 182 (25.63 శాతం) ఓట్లు వచ్చాయి. మరో 15 ఓట్లు చెల్లలేదు. ప్రస్తుతం ఎన్డీఏ బలం తగ్గినప్పటికీ సుదర్శన్ రెడ్డి గెలుపు అంత సులేమీ కాదని రాజకీయ వర్గాలు అంటున్నారు.
Vp 1