(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): గతంలో అయోధ్య రామాలయం అంశం ఎప్పుడు, ఎక్కడ చర్చకు వచ్చినా వెంటనే గుర్తుకు వచ్చేది ఇద్దరే ఇద్దరు. వాళ్లే బీజేపీ సీనియర్ నేతలు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి. అయితే ఉత్తరప్రదేశ్‌లోని అదే అయోధ్యలో దశాబ్దాలుగా కొనసాగిన వివాదానికి ముగింపు తర్వాత ఎట్టకేలకు ప్రారంభమైన రాముడి ఆలయం నిర్మాణం తుది దశకు చేరుకొన్నది. వచ్చే ఏడాది జనవరిలో అంగరంగ వైభవంగా ఆలయ ప్రారంభోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. అయితే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కావొద్దంటూ ప్రస్తుతం బీజేపీలో పెద్దగా క్రియాశీలంగా లేని అద్వానీ, మురళీ మనోహర్ జోషిలకు ఆలయ ట్రస్టు చెప్పడం పెద్ద దుమారం రేపింది.
అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి కారణమైన వారినే ప్రారంభోత్సవానికి వద్దంటారా? అని పెద్దయెత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇది తమకు ప్రతికూలంగా మారే అవకాశం ఉన్నదని గ్రహించిన బీజేపీ అగ్రనాయకత్వం విశ్వహిందూ పరిషత్‌ను రంగంలోకి దించింది. ట్రస్టు నిర్ణయంతో సంబంధం లేకుండా వీహెచ్‌పీ అధ్యక్షుడు అలోక్ కుమార్, ఇతర నేతలు మంగళవారం స్వయంగా ఆద్వానీ, జోషిలను వారి ఇండ్లకు వెళ్లి కలిశారు. ప్రారంభోత్సవానికి ఆహ్వానం పలికారు. అంతకుముందు ట్రస్టు రావొద్దని చెప్పడం.. తాజాగా వీహెచ్‌పీ రమ్మని ఆహ్వానం పలుకడంతో ‘హాజరయ్యేందుకు ప్రయత్నిస్తాం’ అని ఆద్వానీ, జోషీలు వారితో చెప్పినట్టు సమాచారం.
వచ్చే ఏడాది జరుగబోయే లోక్‌సభ ఎన్నికల్లో అయోధ్య రామ మందిర నిర్మాణం తమకు హిందువుల ఓట్లను కుమ్మరించేలా చేస్తుందని, తద్వారా మరోసారి అధికారంలోకి రావడానికి దోహదం చేస్తుందని బీజేపీ భావిస్తున్నది. ఈ నేపథ్యంలో ఆలయ ప్రారంభోత్సవానికి అద్వానీ, జోషీలను ఆహ్వానించకపోతే అది తమకు ప్రతికూలంగా మారే ప్రమాదం ఉందని బీజేపీ అప్రమత్తం అయింది. ఆలయ ట్రస్టు నిర్ణయం వల్ల జరిగిన నష్టాన్ని నివారించేందుకు వీహెచ్‌పీని బీజేపీ అధినాయకత్వం రంగంలోకి దింపినట్టు తెలుస్తున్నది. వృద్ధాప్యం కారణంగానే అద్వానీ, జోషీలను ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కావద్దని చెప్పినట్టు ఆలయ ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మీడియాకు వెల్లడించిన విషయం తెలిసిందే. అద్వానీ వయసు 96, జోషి వయసు 90 కావడం వల్ల వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని రావొద్దని కోరినట్టు చంపత్ రాయ్ వివరించారు. అయితే ఓ వైపు వయసు కారణంగా వీరిద్దరిని రావొద్దని చెప్పి, మరోవైపు 90 ఏండ్ల మాజీ ప్రధాని దేవెగౌడ, 88 ఏండ్ల దలైలామాను ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం ఏంటనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి.
ఆయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవ ఏర్పాట్లు వచ్చే నెల జనవరి 16 నాటికి పూర్తికానున్నాయి. జనవరి 16 నుంచి ఆలయంలో మూల విరాట్ల ప్రాణ ప్రతిష్ఠ పూజలు ప్రారంభం అవుతాయి. అనంతరం జనవరి 22న రామాలయ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ హాజరవుతారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు దలైలామా, మాతా అమృతానందమయి, యోగా గురువు బాబా రాందేవ్, సినీ ప్రముఖులు అమితాబ్ బచ్చన్, రజినీకాంత్, మాధురీ దీక్షిత్, అరుణ్ గోవిల్, దర్శకుడు మాధుర్ భండార్కర్, ప్రముఖ పారిశ్రామికవేత్తలు ముఖేశ్ అంబానీతో సహా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ఆలయ ట్రస్టు ఆహ్వానించింది.