విషపూరిత అగ్ని చీమలు ఓ గ్రామాన్ని ఆక్రమించేశాయి. ఆ గ్రామంలోని ఇండ్లు, ఇంటిగోడలు, చెట్లు, రోడ్లు, బహిరంగ ప్రదేశాలు.. ఇలా ఎక్కడ చూసినా చీమల గుంపులే. గ్రామంలో విధ్వంసం సృష్టించాయి. ఆ గ్రామస్తులు అడుగు తీసి, అడుగేయలేని పరిస్థితి. దీంతో కొన్ని కుటుంబాలు ఇళ్లు వదిలి పారిపోయాయి.

ఈ ఘటన ఒడిశా రాష్ట్రం పూరీ జిల్లా పిప్లీ బ్లాక్‌లోని బ్రాహ్మణసాహి గ్రామంలో జరిగింది. అగ్ని చీమల ధాటికి ప్రజలు విలవిల్లాడిపోయారు. కాళ్లకు పాలిథీన్ కవర్లను కట్టుకొని, నడిచారు. గ్రామంలో 25 కుటుంబాలు నివసిస్తుండగా, 3 కుటుంబాలు ఇండ్లు వదిలివెళ్లిపోయాయి. ఈ పరిస్థితిని సమీక్షించేందుకు శాస్త్రవేత్తలు, పెస్ట్ కంట్రోలర్లు, పరిపాలనా సిబ్బంది బృందం గ్రామానికి చేరుకుంది. ఇందులో ఒడిశా యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ (ఓయూఏటీ) సైంటిస్టులు కూడా ఉన్నారు. చీమ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఓయూఏటీ బృందం చీమల నమూనాలను సేకరించింది. క్రిమిసంహారక మందులు పిచికారీ చేశారు. పరిశుభ్రతా లోపం కారణంగానే చీమలు పెరిగిపోయాయని పూరి కలెక్టర్ సామంత్వర్మ తెలిపారు. గ్రామస్తులు తమ పరిసరాలను శుభ్రం చేసుకోవాలని కోరారు.